తెగని జ్ఞాపకాలు ప్రమోద్ ఆవంచ;- 7013272452
 నేను సూర్యాపేట వెళ్ళాను. అక్కడ ఎన్నో తీపి జ్ఞాపకాలను గుండె నింపుకున్నాను. మస్తిష్క అట్టడుగు పొరల్లో ముద్రించుకున్న కుడ కుడ రోడ్డు,నల్లాల బావి,పాత బస్టాండ్,దాని ఎదురు సందులోకి వెళ్ళి కుడివైపుకు తిరిగితే డాక్టర్ లక్ష్మారెడ్డి గారి ఇల్లు, అప్పట్లో ఆయన సూర్యాపేటలో ప్రముఖ డాక్టర్. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఆయన హాస్పిటల్.. అన్నింటినీ వీక్షించాను. ముప్పై ఏళ్ల క్రితం లక్ష్మారెడ్డి గారి హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లతో ఆ లేన్ అంతా ఎప్పుడూ కిట కిటలాడుతూ ఉండేది.పాత బస్టాండ్ కి కూత దూరంలో ఉండేది.నిన్న కుడ కుడ రోడ్డులో కుడి వైపుకు తిరిగి నిర్మల హాస్పిటల్ మీదుగా,పాత బస్టాండ్ ను ఆనుకొని ఉన్న లైన్లో ప్రయాణం చేస్తూ కోర్టు భవన సముదాయం పక్క సందులోని లక్ష్మారెడ్డి గారి ఇల్లు, హాస్పిటల్ ని చూడాలని ప్రత్యేకంగా వెళ్ళాను. అప్పటి ఆయన తన అభిరుచికి తగ్గట్టుగా కట్టుకున్న  ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఇల్లు కనిపించింది.ఒక ఫోటో తీయాలని అనిపించింది.తీసాను.అలాగే కొంచెం ముందుకు నడుస్తూ హాస్పిటల్ ఉండే స్థలానికి వెళ్ళాను.అక్కడ ప్రస్తుతం ఒక, బీసీ హాస్టల్,ఇంకేదో ఆఫీసు ఉన్నాయి.ఆ లైన్లో నిలబడ్డ ఆ క్షణంలో ఒక్క సారి 93,94 సంవత్సరాల లోకి ఆలోచనలు పరుగులు తీసాయి.డాక్టర్ ఎథిక్స్ ని నూటికి నూరుశాతం పాటింటే అలాంటి గొప్ప వ్యక్తి తన దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషెంట్లను చివరి వరకు అదే ఓపిగ్గా చూసేవారు.
ప్రేమతో పలకరించేవారు.సూర్యాపేట చరిత్రలో ఆయన పేరు  సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది.ఆయన జ్ఞాపకంతో హృదయం తాలూకు బరువైన భారం ఒకవైపు, ఇన్నేళ్ళ తరువాత ఆ రోడ్డుకు వెళ్ళానన్న ఆనందం మరోవైపు కలగలిపి మస్తిష్కంలో ఆక్సిటోసిన్ ఎండార్ఫిన్, డోపమైన్, సెరొటోనిన్, హార్మోన్ల ఉత్పత్తి వేగవంతం అయ్యింది.కారు పిల్లదారి నుంచి మెల్లగా హైదరాబాద్
హైవే లోకి అడుగు పెట్టింది....
                        
కామెంట్‌లు