సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-434
కణజ మూషిక న్యాయము
*****
కణజము అనగా ధాన్యం నిలువ చేసే పాతర లేదా ధాన్యపు కొట్టు,మూషిక అనగా ఎలుక,పందికొక్కు అనే అర్థాలు ఉన్నాయి.
గాదె క్రింద పందికొక్కు గాదె లేదా  పాతరలోనే జీవిస్తుంది అని అర్థము.
 పూర్వం పల్లెల్లో  ధాన్యాన్ని నిలువ వుంచడానికి గాదె లేదా ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించేవారు.ధాన్యాన్ని నిలువ చేయడానికి దీర్ఘ ఘనాకారంలో లేదా వృత్తాకారంలో వెదురుబద్దలతో అల్లిన దానిని గాదె అంటారు. ఇక ప్రత్యేకమైన గది.దీని తలుపులు పదే పదే తీయకుండా గట్టిగా మూసి తాళం వేసే వారు.ఆ గదిలోకి ఒక గవాక్షం అంటే పెద్ద కిటికీ వుండేది. పండిన ధాన్యాన్ని నిచ్చెన వేసుకుని అందులోంచి పోసి నిల్వ వుంచే వారు. ఆహారం కోసం అవసరం అయినప్పుడు అందులోని  ధాన్యం తీయడానికి ఒక వ్యక్తిని దింపి గంపలతో బయటికి తీయించే వారు.మరికొందరు పెద్ద గదిలో ఓ మూలకు చెక్కలతో గదిలా చేసి అందులో పోసి పైన బోరెం లేదా జనపనార బస్తాలు కప్పి ఉంచే వారు.ధాన్యాన్ని  ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అడుగున పందికొక్కులు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి ధాన్యాన్ని/ వడ్లను తిని పొట్టు పొట్టు చేసేవి.
కాదేదీ కవితకనర్హం అన్నట్లు మన పూర్వీకులు పందికొక్కు జీవన విధానాన్ని బాగా గమనించి దానిపై కూడా ఓ న్యాయాన్ని సృష్టించారు.అంతటితో ఆగకుండా దానిని మనిషికి, మనస్తత్వానికి అన్వయించి చెప్పారు.
 పెద్ద పెద్ద పదవుల్లో, ఉద్యోగాల్లో కొనసాగుతూ కొందరు ప్రభుత్వ సంపదను బయటి వారికి తెలియకుండా స్వాహా  చేస్తూ ఉంటారు.మరికొందరు ఆశ్రయం ఇచ్చిన వారి సంపదనే తేరగా తింటూ దానిని హక్కుగా భావించే వారు ఉంటారు. అదిగో అలాంటి వారి బుద్ధి ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది.అప్పుడు అందరూ ఛీ! కొడతారని  హెచ్చరించే దోరణిలో  ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారన్న మాట.
అలా గాదె కింద పందికొక్కుల్లా తింటున్నారంటే అది వారి మితిమీరిన ఆశ, కోరిక  వల్లే కదా!.
అందుకే వేమన  ఓ పద్యంలో ఇలా అంటాడు.
"ఆశలనెడు తాళ్ళ నమర గోయగ జేసి/పారవైవ గాని పరము లేదు/కొక్కు తిండి యాస జిక్కి చచ్చినట్లు/ విశ్వదాభిరామ వినురవేమ!"
"ఆశ, కోరికలనే తాళ్ళతో బంధితులై ప్రజలు మోక్షాన్ని పొందలేక పోతున్నారు.ఈ కోర్కెలను, ఆశలను  పారవేస్తేనే మోక్షం దక్కుతుంది. లేదంటే పందికొక్కు తిండి ఆశకు చిక్కి చచ్చినట్లు అవుతుంది "అంటారు వేమన.
 గాదె కింద పందికొక్కులై  ఇతరుల ప్రజా సంపదను మేసే వారు ఎప్పుడో ఒకప్పుడు నేరస్తులుగా చిక్కుతారు అది తప్పదు అంటారు వేమన. ఆగకుండా ధాన్యాన్ని మేసే పందికొక్కులను చంపడానికి  దానికి ఇష్టమైన ఆహారాన్ని విషంతో కలిపి బోనులో పెడతారు.అది తిండి ఆశకు అందులో చిక్కి చచ్చిపోతుంది.
 అలా గాదె కింద పందికొక్కుల్లా తింటూ దొంగ చాటుగా బతకొద్దు. ఎప్పటికైనా అది వ్యక్తిగతంగా, జీవిత పరంగా ప్రమాదమే. కాబట్టి నిజాయితీగా బతకాలనే అంతరార్థం ఈ "కణజమూష న్యాయము"లో వుంది ‌.అలాంటి  బతుకు బతక్కుండా నీతీ నిజాయితీతో స్వ కష్టార్జితంతో బతకడంలోనే  ఎంతో తృప్తి వుంటుందని ఈపాటికి అర్థమయ్యే వుంటుంది కదండీ.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు