సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -433
కజ్జలజల న్యాయము
*****
కజ్జలము అనగా కాటుక, చీకటి, మబ్బు. జలము అనగా నీళ్ళు,కురువేరు,జడము అనే అర్థాలు ఉన్నాయి.
 కాటుక నీళ్ళలో కలిసినప్పుడు నీళ్ళు నల్లబడవు.ఎందుకంటే కాటుక నీళ్ళలో కరుగదు కాబట్టి.
 నీళ్ళలో పంచదార ఉప్పు లాంటివి కలిపితే రుచి మారుతుంది. ఇక  ఏ రంగు  చుక్కలు వేస్తే నీళ్ళు ఆ రంగులోకి మారడం సహజం.కానీ కాటుక మాత్రం కరుగదు.
ఇక కాటుక విషయానికి వస్తే చాలా మంది మహిళలు ఎంతో ఇష్టంగా కళ్ళకు కాటుకను పెట్టుకుంటారు.పెట్టుకున్న కాటుక కళ్ళలోని తడికి కరగకుండా చాలా గంటల వరకు చెదరకుండా అలాగే వుంటుంది.
కజ్జల జల న్యాయమును పెద్దలు ఎందుకు ఉదహరించారో ఆలోచించే  ముందు కాటుక గురించి నాలుగు మాటలు మాట్లాడుకుందాం.
 కాటుక పెట్టుకున్న చూడటానికి కళ్ళు ఎంతో అందంగా వుంటాయి.కాటుక చలువ చేస్తుందని, అందుకే కళ్ళకు పెట్టుకోవాలని మన అమ్మమ్మలు, బామ్మలు అంటూ వుంటారు రు.తెలుగు వారి సంప్రదాయంలో ముఖ్యంగా చిన్న పిల్లలకి  కాటుక  పెట్టడం  ఓ ఆనవాయితీ.అంతే కాదు కాటుకను  సుమంగళమైన వస్తువుగా చెప్పారు.
మహిళలు నోచుకునే శ్రావణమాస  నోముల్లో  కాటుకకు ప్రత్యేకమైన స్థానం ఉంది.శ్రావణ మంగళవారం  నోముల్లో  కాటుక మహిమ గురించి రాసి వుంది.అందుకే కాటుకను స్వయంగా తయారు చేసి  పేరంటం వచ్చిన స్త్రీలకు కళ్ళకు పెట్టుకొమ్మని ఇస్తుంటారు.
ఈ కాటుకను ఇంట్లో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
 పూర్వం మన పెద్దతరం వాళ్ళు ఆముదపు ప్రమిద వెలిగించి దానిపై పెద్ద తాంబాలం బోర్లించే వారు. దానికంత మసిలా పట్టేది. ఆ మసిని జాగ్రత్తగా ఓ పొడి గిన్నెలోకి తీసుకుని, దానికి ఆముదపు నూనె చుక్కలను కలిపితే నల్లని కాటుక తయారయ్యేది.
అయితే తర్వాత్తర్వాత కాటుక తయారీకి నెయ్యి, నువ్వుల నూనె, బాదం నూనె, ఆముదం నూనెలను ఎక్కువగా ఉపయోగించారు. ఈ నూనెల్లో ఏవైనా రెండు రకాల నూనెలను తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
అలాగే ఒక చిన్న స్టీల్ గిన్నె,మట్టి ప్రమిద లేదా కొవ్వొత్తి, కొన్ని బాదం గింజలు అవసరం.
బాదం గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి మిక్సీలో బాగా మెత్తగా చిన్న నలకలాంటిది కూడా రాకుండా పాల వలె  నూరుకోవాలి. దానిని ఒక చిన్న స్టీల్ గిన్నె లో పెట్టుకుని అందులో నువ్వుల నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపాలి. రెండూ బాగా కలిసిపోయేలా గిలకొట్టాలి.ఆ తర్వాత ఆముదం కూడా వేసి కలపాలి. ఈ గిన్నెను పొయ్యి మీద కాకుండా కొవ్వొత్తి వేడికో,ప్రమిద వేడికో పెట్టాలి.అలా గిన్నె వేడి చేతికి తగలకుండా పట్టుకారుతో ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో గిన్నె లోపలి మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. అలా  ముదురు నలుపు రంగులోకి వచ్చేవరకు వేడి చేయాలి.
చల్లారిన తర్వాత అందులో కొన్ని చుక్కల ఆముదం లేదా బాదం నూనె వేసుకొని పైన వేలితో తీస్తే నల్లటి కాటుక చేతికి అంటుతుంది. దానిని కళ్ళకు పెట్టుకుంటే  ఎలాంటి హానీ జరగదు.
 ఇలా తయారు చేసిన కాటుక  కూడా నీటిలో వేస్తే కరగదు. 
మరి ఈ "కజ్జల జల న్యాయము"ను ఉదాహరణగా చెప్పడానికి గల కారణం ఏమిటో చూద్దాం.
 ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ మాటలు నమ్మి తమదైన అస్తిత్వాన్ని కోల్పోతుంటారు.
 అలా కూడదని చెబుతూ   గిన్నె లాంటి చుట్టూ ఉన్న చిన్న సమాజంలో నైనా, విశాల ప్రపంచంలోనైనా 'నీ ఉనికి నీదే,నీ అస్తిత్వం కోల్పోకు' అని చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థం.
అదండీ కజ్జల జల న్యాయము. ఈ న్యాయము ద్వారా మనమెలా వుండాలో తెలుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు