హృదయగానం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అరుణకిరణాలు
పుడమితల్లిని మాతృప్రేమతో స్పృశిస్తుంటే
పక్షుల కిలకిలారావాలు
జగమంతా ఉల్లాసంతో మారుమోగుతుంటే
తుషారబిందువులను మోస్తున్న
లేలేత ఆకులు బాలభానుడికి
భక్తితో అర్ఘ్యం ఇస్తున్నట్లు కనబడుతుంటే
ఉషోదయాన అల్లన మెల్లన తిరుగాడే
అల్లరిగాలి నన్ను అలా తాకుతుంటే
ప్రభాతారుణిమకు పులకించిన
పూబాలలు మైమరచి
మెల్లమెల్లగా రెక్కలు విచ్చుకుంటుంటే
తమగూడువదలిన భ్రమరాలు
అరవిరిసిన విరులలోని మకరందాలను
గ్రోలుతూ అల్లరి చేస్తుంటే
అంబారావాలతో పశువులు
సందళ్ళు చేస్తుంటే
ప్రకృతి మాత ఒడిలోని
నా హృదయం పులకరించింది
ఈ ఉదయం నా హృదయమంటూ
గానమాలాపించింది!!
***********************************

కామెంట్‌లు