సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -450
కాకిణీ న్యాయము
******
కాకిణీ అనగా నాణెము వలె పూర్వము ఉపయోగించిన గవ్వ‌.ఇరువది గవ్వల విలువ గల నాణెము.పణములో లేదా కర్షణములో నాల్గవ భాగము.కొలతబద్ద,పాదుక అనే అర్థాలు ఉన్నాయి.
ఒక్క కాణీ మూలమున అన్నదమ్ములకు తల్లిదండ్రులకు వైరం సంభవిస్తుంది.అది ఇరువైపులా వినాశనానికి దారి తీస్తుంది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 "ధనం మూలం ఇదం జగత్" అని ఎందుకు అన్నారు? కొంతమంది డబ్బు పాపిష్టిది ప్రాణాలు తీస్తుంది అంటారు కదా!ఎందుకు? అసలు డబ్బు ఎలా ఏర్పడింది? ఎంత కాలం నుండి చెలామణి అవుతోంది? రేఖామాత్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
'ధనమే రా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం " అన్నాడో కవి.
 ప్రస్తుత కాలంలో ఈ ధనం లేదా డబ్బును మనం నాణేల రూపంలోనూ,నోట్ల రూపం లోనూ చూస్తూ ఉన్నాం. ఈ డబ్బు చెలామణికి పూర్వ కాలంలో  వెండి, బంగారు నాణేలు ఉపయోగించేవారని మన చరిత్ర చెబుతోంది.ఇంకా అంతకంటే పూర్వము తిండి గింజలు, వస్తుమార్పిడి ద్వారా జరిగేది. అనగా తమ దగ్గర ఉన్న వస్తువుల్ని లేదా ధాన్యాన్ని ఇచ్చి ఇతరుల నుండి తమకు కావాల్సిన వస్తువులను పొందే వారు. దీనిని ఇంగ్లీషులో" బార్టర్ సిస్టం" అని పిలుస్తారు.
 భారత దేశంలో బ్రిటిష్ వారి హయాంలో అణా మారక ద్రవ్య ప్రమాణంగా వుండేది.ఒక రూపాయికి 16 అణాలు.ఒక అణా అంటే 6పైసలు,అర్ధణా అంటే 3 పైసలు. బేడా అంటే రెండు అణాలు. రూపాయికి 32 అర్ధణాలు;64 కాణీలు;128 ఏగానీలు;192 దమ్మిడీలు; 384 రోలీలు; 768 గవ్వలు...ఇలా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కొంత కాలం వరకు ఈ విధమైన ద్రవ్య మారక పద్ధతి కొనసాగింది. ఆ రోజుల్లో  కొందరు "నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అంటుండేవారు"అంటే రూపాయిలో 768వ వంతు కూడా లేదని అర్థము.
ఆ తర్వాత దశాంశ విధానం అమలు లోకి వచ్చి రూపాయికి 100 నయాపైసలుగా నిర్ణయించారు.
అలా రూపం మార్చుకున్న డబ్బుకు లోకం దాసోహం అయ్యింది."పైసామే పరమాత్మా హై" అనే సామెతా వచ్చింది.
అలాంటి"డబ్బు లేకపోతే డుబ్బుకు కొరగారు" అంటారు.
 డబ్బు ఎవరి వద్ద ఎక్కువగా వుంటుందో వారికి ఈ సమాజంలో  కులమతాలకు అతీతంగా గౌరవం లభించడం మనం నేడు చూస్తూ వున్నాం.అలాంటి డబ్బు కోసం  ఎంతకైనా తెగించడం చివరికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడని కొందరిని చూస్తున్నప్పుడు చాలా బాధ, భయం రెండూ కలుగుతాయి.
అందుకే పెద్దలు "డబ్బు పాపిష్టిది" అంటారు.డబ్బు అవసరమే కానీ అవసరానికి మించిన డబ్బు అతి ప్రమాదకరం. కొందరంటారు డబ్బును  సంపాదించడం,వినియోగించడం పులి మీద స్వారీ లాంటిది. తొట్రుపడకుండా స్వారీ చేసినంత కాలం డబ్బు వల్ల ఎలాంటి ఇబ్బందీ రాదు.పులి మీద నుండి దిగిపోయామా! ఇక అదే పులి బారిన పడే ప్రమాదం ఉంది.
డబ్బు  రక్తసంబంధీకుల మధ్య వైరాన్ని తెస్తుంది.అన్నదమ్ములు ,అక్కా చెల్లెళ్ళ మధ్య పగలు పెంచి ప్రాణాలను సైతం బలి గొనేంతవరకు తీసుకుని వస్తుంది.అప్పటి వరకున్న ప్రేమలు ఆప్యాయతలు బంధాలు అనుబంధాలు అన్నింటినీ దూరం చేస్తుంది..
 ఈ "కాకిణీ న్యాయము" చెప్పేది ఏమిటంటే డబ్బు ఎంతటి అవసరమో అంత ప్రమాదకారి. మనం సృష్టించుకున్న డబ్బు మన అధీనంలో ఉండాలి కాని దాని అధీనంలో మనం వుండొద్దనీ.
ఉన్నంతలో తృప్తి పడటం, చేతనైన సాయం చేయడం, అవసరాలకు మించి ఉన్న డబ్బును సమాజ హిత కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల మానసిక తృప్తి, ఆనందం కలుగుతాయి.అలాంటివి పొందడానికి  సదా ప్రయత్నించాలి. కానీ డబ్బు వల్ల గర్వం అహంకారం పెంచుకుని, బంధాలకు, అనుబంధాలకు , ఆత్మీయతలకు దూరం కాకూడదని  ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు