సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-439
కాకాక్షి న్యాయము
*****
కాకము అనగా కాకి, వాయసము,బలిపుష్టము ,ధ్వాంక్షము, ఆత్మఘోషము అని అనే అర్థాలు ఉన్నాయి. అక్షి అనగా కన్ను,నయనం, నేత్రం.
 కాకాక్షి అనగా కాకి కన్ను.
 కాకి లాంటి పక్షులు ఎన్నో ఉన్నాయి. వాటికీ ఉన్నట్లే కాకికి కూడా కళ్ళు  ఉన్నాయి. మరి కాకాక్షినే లేక కాకి కన్నునే ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకు?అందుకోసం న్యాయాన్నే  మన పెద్దలు ఎందుకు సృష్టించారో? తెలుసుకుందాం.
 కాకి యే వైపు చూస్తే ఆ వైపున ఉన్న కన్నే కనబడుతుందట. ఒకేసారి రెండు కన్నులు  కనబడవట.అందుకే  సమగ్ర దృష్టి పెట్టకుండా ఒక వైపు మాత్రమే చూసి నిర్ణయానికి వచ్చే వారిని ఉద్దేశించి ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారన్న మాట.
మరికొందరేమో కాకికి కంటి గ్రుడ్డు ఒకటే వుంటుందని , అది మెడ ఎడమ ప్రక్కకు తిప్పి చూస్తే దాని కంటి గుడ్డు ఎడమ వైపుకు, కుడి పక్కకు తిప్పి చూస్తే కంటి గుడ్డు కుడి వైపుకు తిరుగుతుందనీ, ఒకటే కంటి గుడ్డు ఉన్నది కాబట్టి కాకిని ఏకాక్షి అని, దానికి  సంబంధించిన"ఏకాక్షి న్యాయము" ఒకటి వుందని పూర్వీకులు చెప్పారని మన ఇళ్ళలో చెబుతుంటారు.
మరింకెందుకు ఆలస్యం.పనిలో పనిగా రామాయణంలో కాకికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా.
 కాకాసుర కథ లేదా కాకాసుర వృత్తాంతం అనేది వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలోని అరణ్య కాండముములోనిది. అయితే ఈ వృత్తాంతాన్ని  సుందర కాండములో సీతమ్మ తల్లి హనుమంతుడికి చెబుతుంది.
హనుమంతుడు సీత జాడను కనుగొన్న తరువాత  రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఇస్తాడు.అది చూసి సీతమ్మ చాలా సంతోష పడుతుంది. తన గుర్తుగా చెంగున కట్టిన చూడామణిని ఇస్తుంది.సీతాదేవిని చూసినట్టు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదైనా సంఘటనను చెప్పమని,ఆ విషయం రాముడికి చెబుతానని అంటాడు.
ఇక కాకాసురుని కథను చూద్దాం.
కాకాసురుడు రాముని భక్తుడు.ఇంద్రుని కుమారుడు. శాప వశం చేత కాకి రూపం పొందుతాడు.
సీతారాములు అరణ్య వాసం చేసేటప్పుడు చిత్రకూట పర్వత శిఖరంపై ఆశ్రమాన్ని నిర్మించుకుని కాలం గడుపుతున్న సమయం.
ఓరోజు సీతమ్మ వారు ఏవో వడియాలు చేసి ఎండ పెడుతుందట. అప్పుడు కాకాసురుడు అనే కాకి వచ్చి వాటిని తింటుండగా దాని పైకి ఓ మట్టిబెడ్డ విసురుతుందట.
అప్పుడు ఆ కాకి వడియాలను వదిలేసి సీతమ్మ వారి వక్షస్థలం మీద వాలి ఆమెను గాయ పరుస్తుందట.
అది చూసిన రాముడు  తన పక్కనే ఉన్న గడ్డిపోచ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ కాకి పైకి విసురుతాడట.దానిని తప్పించుకోవడానికి ముల్లోకాలు తిరుగుతుందా కాకి.కానీ ఆ అస్త్రాన్ని రాముడు విసిరాడని  తెలిసి  రక్షించడానికి  ఎవరూ ముందుకు రారు.
విధిలేని పరిస్థితుల్లో చివరికి రాముడి వద్దకు వచ్చి వేడుకుంటుందా కాకి.సీతమ్మ వారు దయ తలచడంతో రాముడు ఆ కాకాసురుడి ప్రాణం తీయడు.కాకాసురుడే బ్రహ్మాస్త్రానికి తన కన్ను సమర్పిస్తాడు.అందువల్ల  కాకికి ఓ కన్ను పోతుందట.చావాల్సిన కాకాసురుడు ఈ విధంగా బతికిపోతాడు.దీనినే "చావు తప్పి కన్ను లొట్ట పోవడం"అంటారు.
 ఆ విధంగా కాకికి ఒక పోయిందని, మరొక కన్ను మాత్రమే కనిపిస్తుందనీ, అది కూడా ఏ వైపుకు తిరిగి చూస్తే ఆ వైపే తప్ప మరోవైపు కనబడదని అంటుంటారు.అంటే కాకి ఏం చూడాలనుకుంటుందో అటువైపే చూస్తుంది. మరోవైపు చూడదన్న మాట.
అయితే నిజానిజాలకు వస్తే కాకికి అన్ని పక్షుల లాగే రెండు కళ్ళు ఉన్నాయి.పని చేస్తాయి కూడా. అయితే అది ఒక వైపు చూసేటప్పుడు ఒక కన్నునే ఉపయోగిస్తుంది.అంటే అది దేనిమీద నైనా దృష్టి కేంద్రీకరించినప్పుడు, దానిని చూడటానికి దాని కళ్ళలో ఒక కంటిని మాత్రమే ఉపయోగిస్తుంది.
దాని బాధేదో అదే పడుతుంది. మనకెందుకు అనుకుంటాం కానీ దీనిని కూడా మన పెద్దలు మనుషులకు వర్తింపజేసి చెప్పడం విశేషం.
సంపూర్ణమైన అవగాహన లేకుండా ఏక పక్షంగా ఆలోచించే వారినీ,ఏక పక్షంగా నిర్ణయానికి వచ్చేవారిని ఈ "ఏకాక్షి న్యాయము"తో పోల్చుతూ అలా చేయకూడదని చెప్పడమే ఈ న్యాయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఎదుట వ్యక్తిలోని తప్పులు మాత్రమే వెదకాలి అనుకున్న వారికి తప్పులే కనబడతాయి. ఆ వ్యక్తి అప్పటి వరకు చేసిన ఒప్పులు అనగా సత్యసంధత , నిజాయితీ లాంటి మంచి పనులేవీ పరిగణనలోకి రావు.అంటే తప్పు చూపి దోషిగా చూపాలని అనుకున్నప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోవడానికి ఇష్టపడరు. 
 ఇలా న్యాయము ఎప్పుడూ" కాకాక్షి న్యాయము" కాకూడదని ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు