ఓం శ్రీ రామాయ నమః ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 జై హనుమంత! జై హనుమంత! 
శ్రీరామభక్తా శ్రీహనుమంత! 
వందనమిది గొను హనుమంత 
అంజనాసుత హనుమంత 
కేసరితనయా హనుమంత 
వాయునందనా హనుమంత 
వజ్రశరీరా హనుమంత 

సూర్యుని గురువుగ ఎన్నుకొని 
సకల విద్యలూ నేర్చితివి 
నవ వ్యాకరణ బ్రాహ్మణుడని 
పేరు ప్రఖ్యాతులు పొందితివి 
శ్రీరామ నామ ప్రియ హనుమంత

శ్రీరామ కార్యాన హనుమంత 
అంకితమైతివి హనుమంత 
జలధిని శీఘ్రము లంఘించి 
సూక్ష్మరూపమే ధరియించి
సురస సర్పము గర్వమణచి
సింహిక రక్కసి పీచమడిసి
లంఖిణి రాక్షసిని జయించి 
లంకా నగరము జొచ్చితివి 

నగరమునంతా గాలించి
సీత జాడ కనుగొంటివి
శ్రీరామ చరితమును గానంచేసి
శ్రీరామ క్షేమమును వివరించి 
శ్రీరామ ముద్రికను అర్పించి 
శ్రీరామ సందేశమును వినిపించి
సీతమ్మ దుఃఖమును పోగొట్టి 
అమ్మకు ముదమును గొల్పితివి 

బ్రహ్మాస్త్రమును సంధించి 
ఇంద్రజిత్తు నిను బంధించె 
రావణ కొలువులొ నిలబెట్టె
రామదూతగా వచ్చితిననుచు
శ్రీరాముని బలమును తెలిపితివి
ఆగ్రహించిన రావణుడపుడు 
నీ వాలమునకు నిప్పుపెట్టగా 
భీకరరూపము దాల్చితివి 
రాక్షస పొగరును అణచితివి
లంకానగరము కాల్చితివి
వాయువేగమున మరలితివి

జయము జయము శ్రీరామునకు 
జయము లక్ష్మణ సుగ్రీవులకు 
అనుచు అక్కడ వాలితివి 
అమ్మ పంపిన చూడామణిని 
శ్రీరామమూర్తికి అందించితివి 
శ్రీరాముని మెప్పును పొందితివి 
కౌగిట చేర్చెను శ్రీరాముడంత 
భరత సముడవని నిను అనెనంత 
సంజీవినీ కొండను తెచ్చి
సౌమిత్రిని బతికించితివి

ధన్యము ధన్యము హనుమంత 
ధన్యుడవైతివి హనుమంత
జ్ఞానసాగరా హనుమంత
అతులిత బలధామా హనుమంత
నాలుగు యుగాలలో కూడా
నీ ప్రతాపమే ప్రసిద్ధిగాంచినది
అష్టసిద్ధులు నవనిధులను
ప్రసాదించే దాతవు నీవే
నిను స్మరించినంతనె
గాలీ ధూళీ పరారు
దెయ్యం భూతం పరారు
మా కష్టాలన్నీ పరారు

ఎక్కడెక్కడ రామభజన జరుగునో
అక్కడక్కడ తప్పక నీవుంటావు
కనులుమూసుకొని ఉంటావు 
కైమోడిచి నీవుంటావు
భజనలు చేస్తూ ఉంటావు 
శ్రీరామ సీతా లక్ష్మణులను
నీ హృదయంలో సదా నిలిపితివి

జయహారతి గైకొను హనుమంత 
మా సుమన హారతిది హనుమంత
జయము జయము శ్రీ హనుమంత 
శ్రీరామ నామ ప్రియ హనుమంత
ఇది చదివిన వారికి విన్నవారికి 
కేసరి తనయుడు తోడై ఉండును
ఆయురారోగ్యములు సమకూర్చి
అన్ని ఆపదలనుండి రక్షించును !!!
     !!శుభం భూయాత్!!
**************************************
(శ్రీ హనుమత్ విజయోత్సవ సందర్భంగా)

కామెంట్‌లు
visalakshi చెప్పారు…
చాలా సరళ సుందరంగా ఉంది.అభినందనలు