సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -479
గుడ శ్లేష్మ న్యాయము
****"
గుడము అంటే బెల్లము, ఏనుగు,కవచము,కబళము,పొగడ చెట్టు.శ్లేష్మము అనగా కఫము,తెమడ అనే అర్థాలు ఉన్నాయి.
శ్లేష్మ రోగి బెల్లం తిన్నట్లయితే మొదలు శ్లేష్మము ప్రకోపించి అనగా ఎక్కువై ఆ తర్వాత వెనుకటి దానితో సహా బయటికి వస్తుంది అని అర్థము.
 మరి శ్లేష్మము  శ్లేష్మ రోగి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 శ్లేష్మము అనేది వాయు మార్గము. కన్ను, నాసిక చుట్టూ ఒక సాధారణ రక్షణ పొర.అంటే సన్నని జిగట పదార్థం.ఇది శ్వాస కోశ మార్గాన్ని సుగమం చేస్తుంది.ముక్కు, గొంతు మరియు ఊపిరి తిత్తులలోని గ్రంథుల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.అనగా శ్వాస కోశ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.
అయితే శ్లేష్మము కఫము ఒకే అర్థంతో చెప్పినప్పటికీ కఫము వ్యాధికి సంబంధించినది.అది శరీరము నుండి విసర్జించ డానికి సమస్యాత్మకంగా వుంటుంది.
ధూమపానం, అనారోగ్యంలో ఫ్లూ,జలుబు మరియు న్యుమోనియా వంటి అనారోగ్య సమయంలోనూ , వాయు కాలుష్యము వలన శరీరంలోని బాక్టీరియా లేదా వైరల్ కణాలను వదిలించుకోవడానికి ప్రయత్నించినపుడు కఫం ఎక్కువగా మారుతుంది.
శరీరంలో మితిమీరిన కఫము చాలా యిబ్బంది కరంగా ఉంటుంది. అదనపు కఫాన్ని వదిలించుకోవడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. మింగడం లేదా ఉమ్మి వేయడం.
మనిషి శరీరం  వాత పిత్త కఫ  శక్తులతో  రూపొందించబడినదని ఆయుర్వేదం చెబుతోంది.
మరి కఫ దోష నివారణకు  బెల్లం చాలా ఉపయోగకారి.కఫాన్ని తొలగించి ఊపిరి తిత్తులు మరియు శ్వాస కోశాన్ని శుభ్ర పరుస్తుంది శ్వాసను సులభతరం చేస్తుంది.
 బెల్లం తింటే మొదట ఆ తీపిదనానికి కఫం దగ్గు పెరిగినట్లు అనిపిస్తుంది కానీ శ్వాస కోశ ఆరోగ్యానికి బెల్లం చాలా మంచిది.ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుతుంది.
అందుకే రోజూ వారీ దుమ్ము ధూళితో పని చేసేవారు, వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు వారి గాలి మార్గాలను ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా బెల్లం తీసుకుంటారు.
గుడ శ్లేష్మ న్యాయము అనేది ఆయుర్వేద, ఆరోగ్యానికి సంబంధించినదని మనకు అర్థమవుతోంది.మరి మన పెద్దవాళ్ళు  దీనిని ఒక న్యాయముగా చెప్పడంలో అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకుందాం.
మనలోని దేహములోని ఊపిరి తిత్తులలో గల చెడును అనగా అనారోగ్యాన్ని నివారించడానికి  బెల్లం ఉపయోగిస్తారని అర్థమై పోయింది కదా!
'మనసులోని చెడును తొలగించేందుకు కూడా ప్రయత్నం చేయాలనీ, అది కూడా మనసును నొప్పించకుండా తీయ తీయని బెల్లం వంటి  మాటలతో చెడు ఈ "గుడ శ్లేష్మ  న్యాయము' చెబుతోంది.
 కాబట్టి  ఏదైనా కోపంతో చెబితే ఎదుటివారు దానిని    స్వీకరించడానికి ఇష్టపడరు.తీయని మాటలతో మనసును హత్తుకునే విధంగా మంచి మాటలు చెబితే మొదట విముఖత చూపినా ఆ తర్వాత ఎంతటి వారైనా మంచితనానికి విధేయులై  మంచి మార్గంలో నడుస్తారు అనేది ఈ న్యాయం ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం.
ఈ విషయాన్ని గ్రహించాం కదా మనం. మరి తీయని మాటలతో  ఎదుటి వారి మానసిక రుగ్మతలను తొలగించే ప్రయత్నం చేద్దాం.


కామెంట్‌లు