సుప్రభాత కవిత ; బృంద
రేపటికై ఎదురుచూచి
రెప్ప వేయని కనులెన్నో?
మాపున కమ్మిన కలతల
తప్పించు వెలుగుల కోసమే!

చిక్కని చీకటి మూసిన
చక్కని జగతికి దిగులెందుకో?
అక్కర చూపే ప్రేమకై
దిక్కులు చూస్తున్నందుకే!

మాటలు మరచిన మౌనపు
వాదన వినిపించేదెవరికీ?
మమతలు నింపే వెలుగులు
వేడుక తెచ్చే వేకువకే!

వేయని తలుపుల గదిలో
మాయని తలపుల రొద ఏమిటో?
తీసిన తూరుపు వాకిలి
వేసిన వెలుతురు ముగ్గుల కెరుకే!

చూసిన ఎదురుచూపుల 
కాంతులు చుట్టుముట్టేదెపుడో?
కాచిన కన్నుల గుమ్మాన
దాచిన ముత్యాలవాన కురిసేటపుడే!

సహనపు సహగమనమే
ఓర్పుకు ఓదార్పుగా మారి
తీర్పు కొరకై పోరాటం చేసి
మార్పును తెచ్చే వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు