అగ్ని దీపం!!-డా.ప్రతాప్ కౌటిళ్యా
నీవు విసిరేసిన అగ్ని దీపం
మహారణ్యాలను దగ్ధం చేసింది
పగ పట్టిన పులులు సింహాలు
సముద్రాలను ఈదుతున్నవీ!! 
గద్గద స్వరంతో యుద్ధభేరి మోగింది.!!

గోడకు తగిలించబడ్డ అద్దం ముందు
ఒక యుద్ధం జరుగుతుంది.
ఏనుగు నెక్కిన చక్రవర్తి గుర్రం కాళ్ల కింద విరిగిపడ్డాడు.
ఎక్కడి నుంచో వచ్చిన బాణం యుద్ధాన్ని ఆపింది.!!

కాళ్లకు కట్టిన కత్తులని తనకు తానే పొడుచుకునేందుకు
ఇది కోళ్ల పందెం కాదు.
దిగంబరా భయంకర పోరాటం

నగ్నంగానే దిగ్గజాలు దిగజారి శంఖంతో
స్మశానానికి ఒంటరి ప్రయాణం ఇది.

భైరవునిలా సింధూరాన్ని బంధించి బస్మాన్ని చేసిన
సాధు సన్యాసుల రాచకేలి ఇది.

రక్తసికోరల్లో రక్తసిక్తమైన నాలుకలు చదివిన వేదాలు ఇవి.

కాళికా రౌద్రం లో రక్తం తాగుతున్న త్రిశూలం రుద్రరూపం ఇది.

వైరాగ్యం అగ్గి మంటల్లో కాలిన తనువులు తలంటుకుంటున్న సమయం ఇది.

కాలుతున్న శవం కావ్య గానం చేస్తుంటే
రాత్రి భయపడి గంగలో మునిగింది.

మెలుకువ లోనే జామురాత్రి పవిత్రతను వేకువ దొంగిలించింది.

క్షుద్ర పూజల్ని పూల మాలలతో చదరగొట్టిన రుద్రాక్ష మాలలు ఇవి.

అర్ధనాథాల్నీ వేదమంత్రాలుగా మార్చి
నిప్పు పెట్టిన కాలిపోని కేదార్నాథ్ ఆత్మలు హిమాలయాలు అవీ.!!!?

డా. ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు