'పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి';- -ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, తల్లిదండ్రులు తాము కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేసుకోకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. సోమవారం ఆయన ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి, పది రోజుల్లోగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయని, అవి ప్రజల సమిష్టి ఆస్తి అని, ఆ విషయం తెలియక తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన వేలాది రూపాయలను ఫీజుల రూపంలో వృధా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా సకల సౌకర్యాలతో అందంగా, ఆకర్షణయంగా తయారయ్యాయని, విశేష అనుభవం కలిగిన అధ్యాపకులు అంకితభావంతో పని చేస్తూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు చక్కని విద్యనందిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ప్రతి ఏటా ఉచిత సమ దుస్తులు, పాఠ్యపుస్తకాలు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకుగాను ప్రతిరోజు సీఎం బ్రేక్ ఫాస్ట్, రాగి జావ, మధ్యాహ్న భోజనం వంటి అనేక పథకాలను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తోందన్నారు. పిల్లల్లో తెలుగు, ఆంగ్లం, గణిత భావనలను పెంపొందిస్తూ వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. తల్లిదండ్రులు ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఆయన వెంట కాల్వ శ్రీరాంపూర్ గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, కారోబార్ గట్టయ్య తదితరులున్నారు.
కామెంట్‌లు