సుప్రభాత కవిత ; - బృంద
తరుముకొచ్చు మబ్బులైనా
ఆపలేవే నిన్ను కాసేపైనా!
ఉరుములెన్ని ఉరిమినా
ఊరుకోదా అలసిపోయి!

కెరటాలపై  కడలి పంపిన 
నురుగు ప్రేమలేఖలన్నీ
నిన్ను చేరు దారిలేక
వేచిచూచి వెనుకకు మరలదా!

నింగి లోన తొంగి చూచు 
బంగరు రంగులేవో
నివురు కప్పిన నిప్పువోలె
నీవు వచ్చు కబురు చెప్పదా!

నింగీ నేలా కలిసే చోట
నిండు సంద్రపు నీలమంతా
నిన్ను చూసిన సంబరంలో
మిన్ను చేరి మురిసిపోదా!

కలలు కనే స్వప్నమా
కవులు చెప్పే కావ్యమా
కనుల ముందు విందుగా
కదిలి వచ్చిన సత్యంలా

జగతినేలు ప్రభువుగా
జలదాలను కురిపించి
జన జీవులను నడిపించే
కాలచక్ర గమనాధిపతికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 
కామెంట్‌లు