సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -485
గుంజాగ్ని న్యాయము
****
గుంజ అనగా గురిజ వృక్షము,తప్పెట.అగ్ని అనగా నిప్పు, అగ్నిదేవుడు,యాగాగ్ని, జఠరాగ్ని అనే అర్థాలు ఉన్నాయి.
గురువిందను చూసి నిప్పు రవ్వ అనుకోవడం.
గురువింద గింజలు పైభాగమంతా ఎరుపు రంగుతో వుండి కింది భాగంలో ఒక నల్లని మచ్చ వుంటుంది.దీనిని మనుషులకు ఆపాదిస్తూ "గురువింద తన నలుపు ఎరుగదట" అంటూ ఘాటుగా విమర్శించే సామెతను వాడుతారు.
ఈ సామెతను రెండు రకాల అర్థాలతో ఉపయోగిస్తారు.అవి ఏమిటంటే "తాను ఎర్రగా బుర్రగా వున్నానని మురిసిపోతుంది కానీ తనకున్న నలుపు మచ్చ ఎరుగదు.తానో గొప్ప అందగత్తెనని విర్రవీగుంది"  అనే అర్థంతో ఉపయోగిస్తారు. అలాగే తనలో ఉన్న లోపాన్ని  తెలుసుకోకుండా ఎదుటి వారిని తప్పుపడుతూ ఉంటారనే" అర్థంతో అనగా తాము తప్పులు చేస్తూ ఎదుటివారి తప్పులను ఎత్తిచూపే వారిని"గురివింద చందం/గురిగింజ నలుపెరుగదు" అని గురువింద గింజతో పోల్చి చెబుతుంటారు .
ఇక గురువింద గింజ గురించి విశేషాలూ, విషయాలూ తెలుసుకుందాం.
గురువింద అనేది తీగ జాతి మొక్క.పల్లెల్లో ఇవి చెట్లకు చుట్టుకొని కనిపిస్తాయి.గురువింద గింజలను లక్ష్మి స్వరూపముగా భావించి కొలుస్తారు.
ఎవరైనా పెళ్ళయిన మహిళకు కొంచెం కూడా బంగారం లేకుంటే "పాపం ఒంటిమీద గురిజెత్తు బంగారం లేదు " అని సానుభూతిగానో,అంత మాత్రం కూడా పెట్టలేని భర్తను ఏం మనిషి అనో విమర్శించే వారున్నారు.
పూర్వం బంగారాన్ని గురువింద గింజలతో తూకం వేసే వారు. బంగారం పని చేసే వారి ఇళ్ళలో ఇవి ఎక్కువగా కనిపించేవి.ఇక ఇవి ఎరుపు రంగులోనే కాకుండా పసుపు,తెలుపు, ఆకుపచ్చ,నలుపు రంగుల్లో కూడా ఉంటాయి.అయితే అవి అరుదుగా కనిపిస్తుంటాయి.  ఎరుపు రంగు గురివింద గింజలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఈ గురువింద గింజలు చాలా విషపూరితమైనవనీ కొందరు సిద్ధులు వాటిపై పొట్టు తీసి పాలల్లో మరిగించి,అధిక ఉష్ణోగ్రతలో వుంచి వాటిలోని విషపూరిత లక్షణాలు కోల్పోయే విధంగా చేసి ఉపయోగించే వారట.
ఈ చెట్టు గింజలే కాదు వేర్లు ,ఆకులు, కాండంలో కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. గురువింద ఆకులు కొంత నోట్లో వేసుకుని నమిలిన తర్వాత ఒక చిన్న రాయిని నోట్లో వేసుకుని నమిలితే రాయి నలిగి పిండిలా అవుతుందని పెద్దలు అంటుంటారు.
 గురువింద ఆకులు మరిగించిన నూనె తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుందని,ఈ ఆకులకు ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్న చోట కట్టుకడితే వాపులు తగ్గిపోతాయనీ అంటారు. గురివింద గింజలలోని పప్పు తీసి మానసిక రుగ్మతలకు ఔషధంగా వాడతారు.ఇలా చెట్టు మొత్తం మానవుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధీయ గుణాలు కలిగినదని తెలుసుకున్నాం.
ఇక అసలు విషయానికి వద్దాం. గురువింద గింజలను దూరం నుంచి చూస్తే  ఎర్రగా మిలమిలా  నిప్పు రవ్వల్లా మెరుస్తూ కనిపిస్తాయి.అల్లంత దూరం నుంచి చూసినప్పుడు అవి నిప్పు రవ్వలని భ్రమ పడటం సహజం.
మరి మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఎందుకు సృష్టించారో చూద్దాం. కొంత మంది "మేం నిప్పు- ముట్టుకుంటే ముప్పు" అన్నట్లు పైకి అలా కనిపిస్తూ ఎదుటి వారి ముందు గొప్పలు పోతుంటారు. నిజమే కాబోలు అని తెలియని వారు వాళ్ళంటే భయపడుతూ,భక్తీని కనబరుస్తూ వుంటారు. దగ్గరకు వెళితే తెలుస్తుంది అంతా పై పై రూపమేననీ, నిప్పు కాదు ఏం కాదు తనలోని లోపాలను బయట పడకుండా చేసుకున్న ఏర్పాటు అని. అందుకే  అలా గురివింద గింజల్లా కనిపించే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు ఈ "గుంజాగ్ని న్యాయాన్ని" ఉదాహరణగా  చెబుతుంటారు.
"అవండీ గురువింద గింజ ముచ్చట్లు.
మనకు నిత్య జీవితంలో అలాంటి వారు తారస పడితే ఈ "గుంజాగ్ని న్యాయాన్ని" గుర్తు తెచ్చుకుని మా పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు.అనుకుందాం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వుండకూడదనే నిర్ణయం తీసుకుందాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు