క్షణం ఆగిన క్షణం;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
కాలం ఎంత విచిత్రమైనది
ఆగక సాగడమే నైజమనే భ్రమ
కలిగిస్తుంది
క్షణం ఆగిన క్షణం ఆట
ముగుస్తుంది చివరి శ్వాసతో 

రంగుల లోకంలో తిప్పేది 
నిన్నైనా నన్నైనా
రంగుల రాట్నమే 
రంగు రంగుల వలయాలల్లోకి ఎత్తుతూ పడేస్తూ 

ఆశాజీవుల ఎదురుచూపు రేపటి కలలు
నేడు గారెంటీగా గడిస్తే నడిస్తే 
తెరుచుకొనేది రేపటి దర్వాజ 

వాలిన రెప్పలు ఎప్పటికీ
ఘనీభవించిన కిటికీవే
ఎడారి ప్రవాహం ఒంటరి ప్రయాణం
మూసిన రెప్పల పిలుపు క్షణమాగిన క్షణం కథ శాశ్వత నిద్ర 

మన బస ఇక్కడ కొన్నాళ్ళని 
ఎవరనుకోరు
నేనే అంతా...అంతా నాదే స్థితి గతి 
కరిగిన మంచు పుట్టలు
ఒక జననం ఒక జీవితం ఒక సమాప్తం
కాదనలేని నిజం


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
అవును. మృత్యువు ఒక మాయ. అద్భుతంగా కవీశ్వరులు క్షణం ఆగినట్టు గా వర్ణించారు. అసలు ఈ కాల నిర్ణయమే మనిషి మేధస్సు నుండి ఉత్పన్నమైన ఒక పెద్ద మాయాజాలం. జీవితం లోని మనసు మరియు హృదయం చేసే సందడి, అంతా మిథ్య అనే విషయాలు పాఠకులు అలోచించి, ఈ గీతాలాపన ఆనందించాల్సిన క్షణమిది. కంగ్రాట్స్