సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -457
కుక్కుట ధ్వాన న్యాయము
*****
కుక్కుటము అనగా కోడి,అడవి కోడి,కొఱవి.ధ్వానము అనగా ధ్వని,మ్రోత అని అర్థము.
కోడి కూత మొట్టమొదట స్వల్పంగా వుండి పోను పోను దీర్ఘ మవుతుంది. అనగా ఇదిమొదట ఏదైనా చిన్నదే కదాని మొదలుపెట్టిన విషయం రాన్రానూ పెరిగిపోతున్నప్పుడు "కుక్కుట ధ్వాన న్యాయము"తో పోలుస్తూ వుంటారు.
కోడికూత వింటుంటే భలేగా వుంటుంది కదండీ! అయ్యో !నేను కోడిపుంజును తక్కువగా చేసి మాట్లాడుతున్నట్టుగా వుంది కదా. పొరపాటయ్యింది. చక్కగా కూత పెట్టేవి కోడిపుంజులేగా! అయినా వాటి కూతను కోడికూత అంటుంటాం.ఆడకోడికి క్కెక్కెక్కె ,క్కొ క్కొ,క్కొ,అనడం తప్ప  ఏమీ రాదు.
పల్లెల్లో  కోడిపుంజులే కీ ఇచ్చిన గడియారాలు. "తెల్లారింది లేవండో.. కొక్కొరొకో!' అంటూ ఊరు వాడా అందరినీ మేల్కొలుపుతాయి.పల్లెల్లో వాటి కూత వినే రైతులు , కూలీలు ఒకరేమిటి అంతా లేచి పనులు మొదలు పెడతారు.అందుకే ఓ కవి 'కోడికూత జగతికి మేలుకొలుపు' అన్నారు.
కోడిపుంజు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. తలపైన చర్మంతో ఉన్న ఎర్రని తురాయి, రంగురంగుల ఈకలతో  మెడ ఎత్తి తిరుగుతూ చక్కగా, రాజసంగా కనిపిస్తుంది.
 కోడిపుంజులకు పౌరుషం మామూలుగా వుండదు. వేరే మంద నుండి వచ్చిన కోడిపుంజును చూస్తే చాలు కయ్యానికి కాలు దువ్వుతుంది. రక్తాలు కారేలా ఒకదానిని మరొకటి పొడుచుకుంటాయి.అది గమనించేనేమో మన మానవులు కోడిపందాలు మొదలు పెట్టి వుంటారు. వాటిలో పందెం కోసం కోడి పుంజులను ఎంపిక చేసుకుని ప్రత్యేకమైన ఆహారంతో పెంచుతారు . వేలు లక్షల్లో పందెం కాసి పోటీల్లో పాల్గొంటుంటారు.
కోడికూత/ కోడిపుంజు గురించి పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు రాసిన వర్ణన చూద్దామా...
"తొలికోడి కనువిచ్చి నిలచి మైవెంచి/జలజల రెక్కలు సడలించి నీల్గి/గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి/ ముక్కున నీకెలు సక్కొల్పి కడుపు/ వెక్కించి మెడసాచి నిక్కి మిన్ సూచి/కొక్కొరొకోయని కూయక మున్న"
ఈ వర్ణన చదువుతుంటే తొలికోడి కూసే దృశ్యం కళ్లముందు కదలాడుతున్నంత సహజంగా అందంగా వుంది కదండీ!
విషయంలోకి వద్దాం.కోడిపుంజు పొద్దు పొద్దున్నే సూర్యోదయానికి ముందే గొంతు సవరించుకుంటూ  పాల్కురికి సోమన చెప్పినట్లు మెడసాచి నిక్కి కూత పెడుతుంది.ఆ కూత కూడా మొదట చిన్నగా ఆ తర్వాత కొంచెం పెద్దగా అలా చివర్లో రాగం పొడవవుతుంది కదా! ఏది ఏమైనా కోడిపుంజు పద్ధతే వేరు. అవి ఉదయం పూట సామూహిక కూతలు కూడా కూస్తాయి.ఒక్కటి కొక్కొరొకో అని మొదలు పెట్టిందంటే కోరస్ ఎక్కడెక్కడో వాడల్లో వున్నవి కూడా శృతి కలిపి కూస్తాయి.
అలా కొందరు చేసే పనులు కూడా అలాగే వుంటాయి.మొదలు చివర సరిగా  స్పష్టత వుండదు.మొదట చిన్నగా మొదలు పెడతారు.తర్వాత పని త్వరగా ,వేగంగా పూర్తి అయిపోయింది అనుకుంటాం కానీ ఇంకా పనిలో సాగతీత వుంటుంది.అందుకే మన పెద్దలు అలాంటి పనులను చేసేవారిని "కుక్కుట ధ్వాన న్యాయము"తో పోలుస్తుంటారు.
అందుకే సప్త స్వరాలలో కోకిల కూతను తీసుకున్నారు కానీ కోడిపుంజు కూతను తీసుకోలేదేమో.
 ఏమైతేనేం స్వరంలో హెచ్చుతగ్గులున్నా దానికో ప్రత్యేకమైన స్థానం వుంది. చాణుక్యుడు అంతటి వాడు కోడిపంజును ఆదర్శంగా తీసుకోమని చెప్పాడు." సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం. వ్యతిరేక శక్తులపై పోరాడటం.స్వశక్తితో ఆహారాన్ని పొందడం." ఈ లక్షణాలను ప్రతి వ్యక్తీ కోడిపుంజు నుండి నేర్చుకోవాలనీ,ఈ లక్షణాలే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తాయని అంటారు.
ఇలా అనేక రకాలుగా ఉదహరించుకోవడానికి  ఓ న్యాయంగా మనముందు వుంది.అందుకే కుక్కుటానికి, "కుక్కుట ధ్వాన న్యాయానికి_ జై కొడదాం.జై జై అందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు