సుప్రభాత కవిత ; -బృంద
నిదరోయిన నీటి మదిలో
ఎదురుచూసిన రూపం ఎవరిదో?
ఇలకే మణిదీపమై వెలిగే
తూరుపు దీపం భాస్కరునిదే!

అలముకున్న చీకటిని
చిటికెలో మాయం చేసేదెవరో?
పాలమబ్బులకు రంగులు నింపే
వెలుగుల బంతి సూరీడే!

పచ్చనాకుల తోరణాలు
మెత్తగ ఊపే వీవన ఎవరికో??
పచ్చిక మీద ప్రసరించే
మరకతమణి మార్తాండునికే!

అపుడే కను తెరచిన
అరవిందాల ఆనందమెవరిని చూసో?
అరవిరిసిన నవ్వులు చూసి
ఆనందించే ఆదిత్యుడినే!

దర్శించిన గుండెకు నిండైన
పండుగ తెచ్చేదెవరో?
వెచ్చని వేకువ ఇచ్చిన
తాయిలం  తెచ్చే తపముడే!

కొత్త వేకువలో పూచిన
పువ్వుల ఊహలను
ఊరించి ఊతమిచ్చి
ఊయల లూపే ప్రభాకరునికి

🌸 సుప్రభాతం 🌸


కామెంట్‌లు