సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -469
కూర్మాంగ న్యాయము
****
కూర్మము అనగా తాబేలు,ఉప వాయువుల్లో రెండవది. అంగం అంటే శరీరము,శరీర అవయవము,ఓయీ,అయ్యా, విభాగము అనే అర్థాలు ఉన్నాయి.
తాబేలు తన కాళ్ళు చేతులు,తల మొదలైన అవయవములను తన ఉదర భాగంలోకి లాగి జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అవసరమైనప్పుడు తలను ఇతర అవయవాలను బయటికి తీస్తుంది.
ఇతర జంతువులకు,తాబేలుకు ఉన్న తేడా ఇదే. అవసరమైనప్పుడు  శరీర అవయవాలను బయటికి కనిపించేలా చేయడం, వద్దు అనుకుంటే లోపలికి దాచుకోవడం.
ఎందుకు ఇలా చేస్తుందో గమనించిన జంతు శాస్త్రవేత్తల పరిశోధనలో తనకు ఏదైనా హాని కలుగుతుందని అనుకున్నప్పుడు,ఎదుటి జంతువుల దాడి నుండి తప్పించుకునేందుకు, ఏవైనా కారణాల వల్ల భయపడినప్పుడు వెంటనే తలను, కాళ్ళు చేతులను చటుక్కున పొట్ట భాగంలోకి లాక్కుంటుందనీ,తనకు తాను సురక్షితంగా ఉండటం కోసం ఇలా చేస్తుందని తేలింది.
భారతీయ పురాణేతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు తాబేలుకు ప్రత్యేకమైన స్థానం ఉంది.   శ్రీమహావిష్ణువు దశావతారాలలో ధరించిన  రెండవ  అవతారం కూర్మావతారం.
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా.
దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించడాని మందర పర్వతాన్ని కవ్వంగానూ,,వాసుకిని తాడుగానూ ఉపయోగించారు.అయితే మందర గిరి పర్వతం బరువుగా ఉండటం వల్ల మునిగి పోసాగింది. చేయాల్సిన కార్యం మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.అప్పుడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ కొండను తన వీపు మీద భరించాడు. ఈ కూర్మావతారాన్ని పోతన తన భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు.
కేవలం హిందూ పురాణాలలో మాత్రమే కాదు చైనా, అమెరికాలోని కొన్ని స్థానిక ప్రజల పురాణాలలో కనిపిస్తుంది. తాబేలును ప్రపంచ తాబేలు అంటే ప్రపంచాన్ని  మోసే తాబేలు అంటారు.
  కూర్మం లేదా తాబేలు దృఢమైన పైకప్పు అనగా పెంకు లేదా డిప్పను కలిగి ఉంటుంది. తాబేలును జీవులన్నింటికీ వయసులో పెద్ద అయిన తాతగానో బామ్మ గానో చెప్పవచ్చు.
తాబేలు జీవిత కాలం ఎక్కువ.చాలా సంవత్సరాలు జీవిస్తుంది.భూమిపై ఎక్కువ కాలం జీవించే జీవి ఇదే.అతి ప్రాచీన కాలం నుండి అనగా ట్రయాసిక్ యుగము నుండి వీటిలో శారీరకంగా ఎలాంటి మార్పులు రాలేదు.
తాబేలు  గుడ్లు గోళాకారం లేదా అండాకారంలో ఉంటాయి.తాను పెట్టిన గుడ్లను సురక్షితంగా ఉంచడానికి భూమిలో ఇసుక లేదా మట్టిలో గుంతలు తవ్వి, వాటిల్లో రంధ్రాల్లో పాతి పెడుతుంది.
పుట్టినప్పటి పాలు తాపి,నడక నేర్పి... ఇలా ఎంతో సంరక్షణ చేసి, ఎన్నో నేర్పిస్తే కానీ మానవ శిశువు పెద్ద పెరిగి తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుంది.కానీ తాబేలు పిల్లల విషయంలో అలా కాదు.
తమ పిల్లలను రక్షించడానికి, అవి ఎలా జీవించాలో నేర్పడానికి తల్లి తాబేలు వాటి దగ్గర వుండదు. గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ తామంతా తామే జీవన పోరాటం చేయాల్సి ఉంటుంది.
 ఇక తాబేలును అంతర్ముఖి అని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుందనీ చెబుతుంటారు.అలాగే మౌనంగా వుండే జీవి అని కూడా అంటారు. కానీ అందులో నిజం లేదట. అవి కుక్క, పిల్లి,కోడిలా శబ్దాలు కూడా చేస్తాయట అయితే ఆ శబ్దాలు పెద్దగా వినపడవట లెండి. ఏది ఏమైనా అది మిత భాషిణి మృదు భాషిణి అని చెప్పుకోవచ్చన్న మాట.
 ఇలా  సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు అవతారమైన కూర్మం గురించి బోలెడు విషయాలు విశేషాలు తెలుసుకున్నాం.
ముఖ్యంగా  తాబేలులో అందరికీ నచ్చేది మనమంతా ఆచరించాల్సింది ఏమిటంటే  ఎవరి జోలికి పోకుండా తన మానాన తాను వుంటుంది.అవసరమైనప్పుడు మాత్రమే తల బయటకు తీసి చుట్టూ పరికిస్తుంది.ఎందులోనూ తొందరపడదు. "తాబేలు లా నడుస్తున్నావేరా?" అని ఎవరైనా తనతో పోల్చి తిట్టినా,విమర్శించినా కోపం తెచ్చుకోదు. నడకలో మార్పుకు అసలు ఇష్టపడదు."నిదానమే ప్రధానము" అన్నది తాను సృష్టించుకున్న నినాదం, సూక్తి. ఎప్పటికీ దానిని అతిక్రమించదు.భూత దయ అనో, గొప్ప కోసమనో పెంచుకున్నా కుక్కలా విశ్వాసం చూపడం, వెంట పడి వదలకుండా తిరగడం లాంటి వేమీ వుండవు.
ఇలా తాబేలుకు ఉన్న లక్షణాలు అన్నీ మనకూ ఆచరణీయం, అనుసరణీయమే...
కాబట్టి మన పెద్దలు చెప్పినట్లు "కూర్మాంగ న్యాయము" అనేది 100శాతం  ఆచరణ, అనుసరణీయం కాబట్టి  మనం కూడా ఆచరిద్దాం.అనుసరిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు