పిల్లపెత్తనం చేసిన నక్క డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   ఒకూర్లో ఒక అవ్వ వుండేది. ఆమెకో మనవడున్నాడు. కొడుకు కోడలూ చిన్న వయసులోనే చనిపోవడంతో అవ్వే మనవన్ని పెంచుకుంటా వుంది. వాడు చానా మంచోడు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా చేతనైన సాయం చేసేటోడు. ఒకరోజు అవ్వ మనవన్ని పిలిచి "రేయ్... సంతకు పోయి ఒక మంచి పాలిచ్చే బంగారంలాంటి బరగొడ్డుని కొనుక్కోని రాపోరా" అని పంపిచ్చింది. వాడు సరేనని డబ్బులు తీసుకోని పోతావుంటే అడవిలో ఒక రైతు ఒక నక్కను తాడుతో కట్టేసి బరబరా గుంజుకోని పోతా కనబన్నాడు.
ఆ నక్క దారిలో కనబన్నోళ్ళనంతా "అనా... అనా... కొంచం కాపాడండనా... ఈ ఒక్కసారికి వదిలెయ్యమని చెప్పండనా... మీకు పుణ్యముంటాది" అని అడుగుతా వుంది. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది చూసి వాడు "ఏందనా... దాన్ని పట్టుకోని అట్లా పోతావున్నావు. ఏమైంది" అన్నాడు. దానికా రైతు పళ్ళు పటపటమని కొరుకుతా "ఈ దొంగసచ్చినేది
మొన్న ఎవరూ లేనిది సూసి నా మంచి కోడిపుంజును లటుక్కున పట్టుకోని చంపి తినేసింది. అందుకే ఈ రోజు వలేసి పట్టుకున్నా. దీన్ని అడవిలోనికి తీసుకోని పోయి చంపితే తప్ప నా కోపం తీరదు" అన్నాడు. వాడు నక్కకెళ్ళి చూసినాడు. దాని ఒళ్ళంతా రక్తం కారతా వుంది. అయ్యోపాపమని జాలేసింది. దాంతో “అనా... ఏదో ఆకలై కడుపు నింపుకోడానికి తప్పు చేసింటాది. దానికే అంత శిక్ష వేస్తే ఎట్లా. ఇప్పటికే బాగా మెత్తగా తన్నినావు గదా. ఇంక వదిలెయ్యి. మళ్ళా జన్మలో ఈ దరిదాపులకు గూడా రాదులే" అన్నాడు. కానీ దానికారైతు ఒప్పుకోక “ఏందీ... బంగారంలాంటి నా కోడిపుంజుని చంపిన దీన్ని వదిలెయ్యడమా. చచ్చినా వదలను. ఈరోజు దీన్ని చంపి బూడ్చి పెట్టాల్సిందే" అన్నాడు కోపంగా. దాంతో వాడు "అనా... అనా... ఎందుకో దీన్ని చూస్తా వుంటే జాలేస్తా వుంది. కావాలంటే ఈ డబ్బులు తీసుకోని దాన్ని నాకియ్యి" అన్నాడు అవ్వ ఇచ్చిన డబ్బులు చూపిస్తా. అన్ని డబ్బులు చూసేసరికి ఆ రైతుకి ఆశ పుట్టింది. “వీడెవడో పిచ్చోనిలెక్కున్నాడు. ఆలస్యం చేస్తే బంగారంలాంటి అవకాశం తప్పిపోవచ్చు" అనుకోని వెంటనే వానికి నక్కను అప్పజెప్పి డబ్బులు తీసుకోని వెళ్ళిపోయినాడు.
వాడు నక్కకు కట్లు విప్పి దెబ్బలకు కట్టు కట్టి ఇంటికి తీసుకోనొచ్చినాడు. అది చూసి వాళ్ళవ్వ “అరే... ఇదేందిరా... మాంచి పాలిచ్చే బంగారంలాంటి బరగొడ్డును తీసుకోని రమ్మంటే ఇట్లాంటి పనికిరాని పోరంబోకు దాన్ని తెచ్చినావు. ఏం చెయ్యాల దీన్ని అనవసరంగా తిండి దండుగ" అనింది. దానికా నక్క “అవ్వా... అవ్వా... అంతమాట అనొద్దు. అన్నగాని కాపాడకపోతే ఇప్పటికల్లా సచ్చి శవమై సక్కగా స్వర్గానికి పోతా వుంటి. నా ప్రాణాన్ని నిలబెట్టినాడు కాబట్టి మీరు కలలో గూడా వూహించనంత మేలు ఏదో ఒకటి చేస్తా. కొద్ది రోజు లాగండి. ఈ దెబ్బలు కొంచం తగనీ" అనింది. 
"సర్లే... మాటలకేంలేగానీ కోటలు దాటించొచ్చు. చెప్పడం కాదు చేసి చూపించు. అప్పుడు నమ్ముతా" అనింది అవ్వ.
నక్క ఆ ఇంట్లోనే వుంటా... వాళ్ళు పెట్టింది తింటా కొద్దిరోజుల్లోనే మళ్ళా మామూలుగా తయారయ్యింది. ఒకరోజు అవ్వ దగ్గరికి పోయి "అవ్వా... అవ్వా.... నాకు రేప్పొద్దున చద్ది కట్టు. ఈడికి కొంచం దూరంలోనే ఒక రాజున్నాడంట. ఆయనకు ఒకే ఒక కూతురుందంట. పోయి మనోనికి ఇస్తాడేమో కనుక్కోకొస్తా" అనింది. దానికా అవ్వ “ఏందీ... మనోనికి రాజు కూతురా... తెలివుండే మాట్లాడతావున్నావా... వాళ్ళెక్కడ మనమెక్కడ... నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది" అనింది. 
దానికా నక్క నవ్వుతా “అవ్వా... అదంతా నీకెందుకు. చూస్తా వుండు నేనేం చేస్తానో" అని సర్ది చెప్పింది. తరువాత రోజు పొద్దున్నే అవ్వ లేసి అన్నం చేసి మూట కట్టింది. నక్క దాన్ని తీసుకోని పోతా వుంటే ఎదురుగా లక్ష్మిదేవి అడ్డం వచ్చింది.
“చీ... చీ... చీ... పొద్దున్నే ఈమె మొగం చూసినా, ఇట్లాంటోళ్ళ మొగం చూస్తే పనయినట్లే" అని గొణుక్కుంటా మరలా ఇంటికొచ్చి బువ్వ పాడేసింది. అది చూసి ఇవ్వ "ఏందే... బంగారంలాంటి బువ్వనట్ల నేలపాలు చేసినావు. ఏమైంది" అనింది. దానికా నక్క "ఏం చేద్దామవ్వా మంచి పనికి పోతా వుంటే లక్ష్మిదేవి ఎదురొచ్చింది. అందుకే తిరిగొచ్చేసినా" అనింది. దానికా అవ్వ “అదేంటే... లక్ష్మీదేవి ఎదురైతే మంచిదే గదా" అనింది ఆచ్చర్యపోతా. ఆ మాటలకా నక్క "ఏందవ్వా అట్లంటావు. లక్ష్మిదేవి ఎప్పుడూ వున్నోళ్ళ దగ్గర్నే వుంటాది తప్ప మనలాంటి లేనోళ్ళకెళ్ళి కన్నెత్తయినా చూస్తాదా... వాళ్ళు మంచోళ్లా చెడ్డోళ్లా అని అస్సలు పట్టిచ్చుకోదు. జనాలని ముంచేటోళ్ళయినా, ఖూనీకోర్లయినా, దొంగలయినా, అచ్చరం ముక్క రానోళ్ళయినా ఏ మాత్రం పట్టిచ్చుకోకుండా వాళ్ళ దగ్గర్నే కులుక్కుంటా తిరుగుతా వుంటాది. అందుకే ఆమె అంటే నాకస్సలు పడదు" అనింది.
తరువాత రోజు పొద్దున్నే మళ్ళా అవ్వ కట్టిచ్చిన సద్దిమూట తీసుకోని నక్క బైటకొచ్చింది. అంతలో దానికీసారి సరస్వతీదేవి ఎదురొచ్చింది. ఆమె మొగం చూడగానే “ఛ... ఛ... ఛ... పొద్దున్నే ఈమె మొగం చూసినాను. ఇట్లాంటోళ్ళ మొగం చూస్తే ఇక పనయినట్లే" అని గొణుక్కుంటా మరలా లోపలికి వచ్చి బువ్వ పాడేసింది.
అది చూసి అవ్వ "అదేంటే... మళ్ళా ఈరోజు కూడా పాడేసినావు. ఏమైంది" అనింది. దానికా నక్క “ఏం చేద్దామవ్వా... పోతా వుంటే సరస్వతీదేవి ఎదురొచ్చింది. అందుకే తిరిగొచ్చేసినా" అనింది. అందుకా అవ్వ “అదేందే... సదువుల తల్లి సరస్వతీదేవి ఎదురైతే మంచిదే గదా" అనింది ఆచ్చర్యపోతా. దానికా నక్క "ఏందవ్వా అట్లంటావ్... సరస్వతీదేవి ఎప్పుడూ వున్నోళ్ళ దగ్గర్నే వుంటాది తప్ప మనలాంటి లేనోళ్ళ వంక కన్నెత్తయినా చూస్తాదా... వాడు నాలుగు ముక్కలు సదువుకోని జనాలను వుద్ధరిస్తాడా లేక నిలువునా ముంచేస్తాడా అనేది అస్సలు పట్టిచ్చుకోదు. ఎంత పనికిమాలినోడయినా సరే డబ్బులుంటే సాలు కులుక్కుంటా వాళ్ళ నట్టింట్లో సంబరంగా దిగుతా వుంటాది. అందుకే ఆమె అంటే నాకస్సలు ఇష్టం లేదు" అనింది.
మూడోరోజు పొద్దున్నే మళ్ళా అవ్వ కట్టిచ్చిన సద్దిమూట తీసుకోని నక్క బైటకొచ్చింది. అంతలో దానికి అటువైపు పోతా వున్న అగ్నిదేవుడు కనబన్నాడు. వెంటనే “అవ్వా... అగ్నిదేవుడు కనబన్నాడు. ఇంగ పోయెస్తా" అనింది. దానికా అవ్వ
“అదేందే... నీకు లక్ష్మిదేవి, 
నరస్వతీదేవి చెడ్డయి... కొంపలంటించే అగ్నిదేవుడు మంచోడయినాడా.... నేనెక్కడా చూళ్ళా ఇట్లాంటి విడ్డూరం" అనింది.
దానికా నక్క “అదేందవ్వా... అంత మాటంటావు. ఎవరింట్లో పొయ్యి వెలగాలన్నా...
నోట్లో కింత కూడు పోవాలన్నా అగ్నిదేవుడే గదా దిక్కు. పాపం వున్నోళ్లా లేనోళ్లా అని అస్సలు చూడడు. అందరింట్లోనూ వెలుగు తుంటాడు.
అందుకే ఆయనంటే నాకు చానా ఇష్టం" అంటూ సద్ది తీసుకోని సక్కగా రాజుగారి పూరికి బైలుదేరింది. అడవులు దాటుతా, కొండలు దాటుతా, నదులు దాటుతా చివరికి ఆ రాజ్యానికి చేరుకోనింది. భటులు దాన్ని ఊరు వాకిలి కాన్నే ఆపేసినారు. “ఎవరు నువ్వు... యాన్నుంచి వస్తా వున్నావు. మా రాజ్యంలో నీకేం పని" అని అడిగినారు. దానికా నక్క "నేను చానా దూరం నుంచి ఒక రాజు పంపిస్తే వస్తా వున్నా. మీ రాజు కూతురు సక్కదనాల సుక్కంటగదా... మా పిల్లోనికేమయినా ఇస్తారేమో కనుక్కోవాల. పోండి పోయి మీ రాజుతో నేను పిల్ల పెత్తనానికి వచ్చిన విషయం చెప్పి రాపోండి" అనింది. సరేనని వాళ్ళు పోయి రాజుకు చెప్పినారు. “నక్కేంది... పిల్ల పెత్తనానికి రావడమేంది" అని రాజు ఆచ్చర్యపోయి దాన్ని పిలిపించినాడు. రాజు నక్కతో... “నా కూతురితో పెండ్లంటే మాటలు గాదు. మా భవనాలు, బంగారం, భోగభాగ్యాలు అన్నీ చూసినావు గదా... మరి మీ పిల్లోనికేమున్నాయి" అని అడిగినాడు.
దానికా నక్క “ఏంది రాజా అట్లంటావు. మాది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా పట్టణం కాదు. పన్నెండామడల పట్టణం. ఇంటింటి ముందు బంగారు అరుగులు, రత్నాల ముగ్గులు వుంటాయి. కింద పోయే చీమ మాట్లాడతాది. పైన పోయే దోమ మాట్లాడతాది. ఊన్నోళ్ళు ఇంట్లో రత్నాల పళ్ళెంలో తింటే, ఎంత లేనోళ్ళయినా బంగారు పళ్ళెంలో తింటారు. చుట్టు పక్కల ఏడేడు లోకాల్లోనూ అట్లాంటి నగరం మరెక్కడా వుండదు" అని చెప్పింది. దాంతో రాజు సంబంధానికి ఒప్పుకోని ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు. 
"సరే... ఇప్పటికి పదైదు రోజుల తర్వాత మంచి ముహూర్తం వుంది. ఆ రోజు పిల్లను తీసుకోని మా ఊరికి రండి" అంటూ అన్నీ మాట్లాడుకోని ఎల్లెట్ల రావాల్నో చెప్పి బైలుదేరింది.
నక్క ముహూర్తాలైతే పెట్టించింది గానీ ఈడ చూస్తే తినడానికి తిండి గూడా సరిగా లేదు. దాంతో అడవిలోనికి పోయి నిమ్మకాయ మీద నిమ్మకాయ పెట్టి, దాని మీద నిలబడి ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై “ఏందే నక్కా... ఏందీ తపస్సు. పద్మాసనంలో తపస్సు చూసినా, ఒంటికాలి మీద తపస్సు చూసినా, అన్నం
తినకుండా తపస్సు చూసినా, తలకిందులుగా తపస్సు చూసినా గానీ ఇట్లా నిమ్మకాయ మీద నిలబడి తపస్సు చేసినోళ్ళని ఇంతవరకూ ఏడేడు పద్నాలుగు లోకాల్లో యాడా చూల్లేదు. చెప్పు... ఎందుకిట్లా ఘోరంగా తపస్సు చేసినావు. ఏం కావాల నీకు" అని అడిగినాడు.
అప్పుడానక్క "ఏం లేదు సామీ... చానా చిన్న కోరిక. నాకు పన్నెండామడల పట్టణం కావాల. అందులో ఇంటింటి ముందు బంగారు ఆరుగులు, రత్నాల ముగ్గులు వుండాల. కింద పోయే చీమ మాట్లాడాల, పైన పోయే దోమ మాట్లాడాల. ఉన్నోళ్ళు రత్నాల పళ్ళెంలో తింటా వుంటే ఎంత లేనోళ్ళయినా బంగారు పళ్ళెంలో తింటా వుండాల. అట్లాంటి నగరాన్ని కేవలం పదేపది రోజులు వుండేలా నా కోసం తయారు చేసివ్వండి చాలు. అంతకు మించి ఇంకేం వద్దు" అనింది. 
“సరే... పదిరోజులే అంటా వున్నావు గదా... ఇస్తా పో" అన్నాడు. శివుడు. 
అంతే... మరుక్షణంలో అక్కడ కనీవినీ ఎరగనంత అద్భుతమైన పట్టణం ప్రత్యక్షమైంది. నక్క పోయి అవ్వను, మనవన్ని తీసుకోనొచ్చి పన్నీటిలో స్నానం చేయించి, పట్టుబట్టలు కట్టించి, అంగరంగ వైభవంగా ఊరంతా ఊరేగించి సింహాసనం మీద కూర్చోబెట్టి పక్క ఊరి రాజుకు కబురు పంపింది.
రాజు కూతురిని తీసుకోని బంధువులతో, మిత్రులతో ఆ ఊరిలో అడుగు పెట్టినాడు. యాడ చూసినా బంగారమే... యాడ చూసినా రత్నాలే... పైన పోయే దోమ పలకరిస్తా వుంది. కింద పోయే చీమ పలకరిస్తా వుంది. ఆ వింతలన్నీ చూసుకుంటా రాజభవనంలోనికి అడుగు పెట్టినారు. నక్క ఎదురొచ్చి అందరినీ విడిదింటికి తీసుకోని పోయింది. తాంబూలాలు మార్చుకున్నారు. మూడు రోజుల తరువాత పెండ్లి పెళ్ళికూతురి ఇంట్లో చేద్దామనుకున్నారు. నక్క అందరినీ తీసుకోని రాజుగారి ఊరికి పోయింది. రాజు వాళ్ళకు ఏ మాత్రం తక్కువ చేయకుండా భూమంత అరుగేసి, ఆకాశమంత పందిరేసి కనీవినీ ఎరగనంత అద్భుతంగా పెండ్లి చేసి ఊరు ఊరంతటికీ మూడు పూటలా అరవై ఆరు వంటకాలతో అద్భుతంగా అన్నం పెట్టించినాడు. అట్లా ఆడ మూడు రోజులు గడిచిపోయినాయి.
నక్క మరలి పెండ్లికి కొత్త కోడల్ని, రాజుని అందరినీ తీసుకోని వచ్చింది. అది ఆ పట్టణం తయారయిన పదవరోజు. శివుడు వరమిచ్చింది పది రోజులకే గదా... దాంతో వాళ్ళు ఆ పట్టణంలో కాలు పెట్టడం ఆలస్యం పట్టణం మొత్తం మాయమైపోయింది. అది చూసిన నక్క వెంటనే “ఓరి నాయనోయ్... మీ పిల్ల కాలు మంచిది కానట్టుంది దేవుడోయ్... ఆ పిల్ల అడుగు పెట్టగానే మా బంగారు పట్టణం కాస్తా మాయమైపోయింది... ఇంక పిల్ల కాపురానికొస్తే ఇంకేం జరుగుతాదో ఏమో నాయనోయ్. మాకు ఈ పిల్లా వద్దు దీనితో సంసారమూ వద్దు దేవుడోయ్" అంటూ దొంగేడుపు ఏడవసాగింది.
అది చూసి రాజు "లేదు... లేదు... మీరేమీ బాధ పడకండి. నాకెట్లాగూ కొడుకులు లేరు. వుండేది ఒక్కతే కూతురు. అల్లున్ని నాతోబాటే వుంచుకుంటా... ఎట్లాగూ నా తర్వాత రాజ్యం అల్లునికే గదా" అని చెప్పి కూతుర్ని, అల్లున్ని, అవ్వను తీసుకోని తన రాజ్యానికి వెళ్ళిపోయినాడు.
"హమ్మయ్య... నా ప్రాణాలు కాపాడినందుకు ఋణం తీర్చుకున్నాను" అనుకోని నక్క సంబరంగా తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయింది.
***********
కామెంట్‌లు
Sridhar Akkineni - ( He )Artiste' చెప్పారు…
డాక్టర్ గారూ..నమస్తే.
కథ బాగుంది, అభినందనలు.
- శ్రీధర్ అక్కినేని.