సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -492
గో క్షీర న్యాయము
     ******
గో అంటే ఆవు, భూమి, వాక్కు,సరస్వతి, తల్లి, దిక్కు, ఎద్దు ,కిరణము, స్వర్గము,చంద్రుడు వజ్రాయుధము,కన్ను అనే అర్థాలు ఉన్నాయి. క్షీరము అంటే పాలు.
 హిందువులలో చాలామంది గోవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.గోమాతగా పూజిస్తారు.గోవు పాలను కూడా ఎంతో పవిత్రమైనవిగా భావించి,వారు నిర్వహించే నోములు, వ్రతాలు,యజ్ఞాల్లాంటి  వివిధ పూజాదికాలలో గోవు పాలను ఉపయోగిస్తుంటారు.
అయితే మన దేశంలో ఆవు పాల కంటే గేదె పాలే ఎక్కువగా దొరుకుతాయి.మరి దైవారాధనలో సరిపడునన్ని ఆవుపాలు దొరకడం కష్టం కనుక గేదె పాలలో  ఆవు పాలను కొన్ని కలిపి వాటిని పూజలలో ఉపయోగిస్తుంటారు.
అలా కలపడం వల్ల గేదె పాలకు కూడా పవిత్రత చేకూరుతుందనీ, దైవారాధనకు, పూజలకు అర్హత పొందుతాయని ఓ నమ్మకం.
ఇలాంటి నమ్మకాలకు సంబంధించిన ఓ ఉదాహరణ చెప్పుకుందాం.ఇది కూడా మత విశ్వాసానికి సంబంధించినదే. "శంఖులో పోస్తేనే తీర్థం" అనే సామెతను మనం  చిన్నప్పటి నుండే విని వున్నాం.
 శంఖు లేదా శంఖం అనేది ఓ పవిత్రమైన వస్తువుగా  చాలా మంది భావిస్తారు. దానిని  పూజ గదుల్లో పెట్టుకుంటారు. పూజల్లో ఉపయోగించినప్పుడు అందులో నీటిని పోసి దేవుని ముందు  పెట్టి పూజానంతరం ఆ నీటిని  పవిత్ర జలంగా భావించి తీర్థంగా ఇస్తుంటారు. అంటే శంఖంలో ఉన్న నీళ్ళు .మాములుగా తాగే నీళ్ళే కానీ శంఖంలో పోయడం వల్ల ఆ నీటికి పవిత్రత కలిగింది.
అనగా ఆయా సందర్భాలలో ఆ యా వస్తువులకు ఆపాదించబడిన పవిత్రత వల్ల వాటిని  ఉపయోగించినప్పుడు ఇలా పవిత్రత చేకూరిందన్న మాట.
కేవలం హిందూ మతములోనే కాదు. వివిధ మతాలలో అనేక రకాల నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆ నమ్మకాలలో కొన్ని వస్తువులు  పూజనీయమై పవిత్రమైన వస్తువులుగా పరిగణించబడినవి. అవసరమైన సందర్భాల్లో వాడబడినవి.
 అలాంటి వాటిని ఎంతో భక్తితో ఉపయోగించడం. ఒకవేళ అసలైనవి దొరకనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర వస్తువులను ఉపయోగించడం మనం  చూస్తూ ఉంటాము.
 "గో క్షీర న్యాయము అంటే ఇదే. పవిత్రమైన వాటితో ఇతరములు జత చేయడం వల్ల అవీ పవిత్రంగా మారతాయనే నమ్మకం.
ఈ సందర్భంగా ఓ కవి రాసిన పాటను చూద్దాం."అమ్మ కొడులందరూ అన్నదమ్ములే/ ఆ పిల్లల నవ్వులన్ని అమ్మ సొమ్ములే.... వేర్వేరు భావనలు నమ్మకాలలో కానీ అమ్మ కాడ కాదురా " అంటే కేవలం నమ్మకాలు,విశ్వాసాల వల్లనే  అసలు అంతా ఒక్కటే అని అర్థము.
ఇలా ఎవరికి ఏ హానీ జరగనంత వరకు నమ్మకాలు,విశ్వాసాల వల్ల వచ్చే నష్టమేమీ లేదు.కానీ ఒకరి నమ్మకం, విశ్వాసం మరొకరికి యిబ్బంది, బాధను కలిగించగూడదు.
ఇదండీ "గోక్షీర న్యాయము" లోని అంతరార్థం. అది తెలుసుకుందాం. తెలిసి మసలు కుందాము. ఏమంటారు?

కామెంట్‌లు