పొడుపు పద్యములు~~;- కరణం మాణిక్ రావు
    ఆట వెలది-01
అరయ బూను పదముకక్షరమ్ములు నాల్గు
ఒండు,రెండు చదువు నొప్పు "సగము"
మూడు, నాల్గు నరసి చూడ "మాల"యగును
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు !
               ఆట వెలది-02
వాడు పదము నరయ మూడక్షరమ్ములు
మొదటి,రెండు చదువ నుదధినుండు
మూడు,రెండు కలిపి చూడగా "స్వప్నము"
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు!
               ఆట వెలది-03
అరయ గోరు మాట కక్షరమ్ములు నైదు
మొదటి,రెండు చదువ నొదవు "పగలు"
మూడు నాలు గైదు చూడ "తాత్పర్యము"
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు!
               ఆట వెలది-04
ముచ్చటైన పండు మూడక్షరమ్ములు
ఒండు,రెండు‌ చదువ నొప్పు సగము
ఒండు, రెండు తొలగి జూడ నాంగ్ల పదము
విప్పి జెప్ప వోయి !  వింత పొడుపు!
               ఆట వెలది-05
అరయు మాట కొరకు నైదక్షరమ్ములు
కోర చివరి మూడు "మిరప ఘాటు"
మొదటి, రెండు చదువ నొదవు "తామసి"యగు
విప్పి జెప్ప వోయి! వింత పొడుపు !
 ✍️ కరణం మాణిక్ రావు 
  ‌‌    తాండూరు, వికారాబాద్ జిల్లా 
      9440481750
***********
జవాబులు:- 1. అరదండ 2. అలక      3.అహంభావము 4. అరటి  5. అంధకారము

కామెంట్‌లు