సుకృతం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 
నీలినింగిలో 
అల్లరి మేఘయవనిక తొలగించుకుని
చక్కనిచుక్కల పరిష్వంగాన్ని వీడి
మాకోసం నీవిలా ప్రవహించడం
అమ్మపాలతోకూడా వ్యాపారంచేసే
ఈరోజుల్లో, క్షీరాబ్దిలోజనించిన నీవు
కరిగి క్షీరపాతంగా మారిపోవడం
పాలకోసం ఆర్తిగా ఏడుస్తున్న
అనాథపిల్లలకోసం నీవు
జాలిగాకరిగి క్షీరధారగా మారిపోవడం
సకలజీవులపై నీకున్న 
అవ్యాజప్రేమకు చిరునామాగా నీవు
శుభ్రశరఛ్ఛంద్రికాకిరణ
భాసురధారగా మారిపోవడం
మాకు సుస్నేహానురాగాల
సుమగంధం అలదడంకోసం నీవు
క్షీరార్ణవపాతంగా మారిపోవడం
ఈజగతిలో క్షీరవిప్లవానికి నాందిగా
నీవిలా క్షీరౌఘనిర్ఝరి గా మారిపోవడం
మా పూర్వజన్మ సుకృతమే సుమా!
చంద్రమా! నీకు మా సుమనస్కాంజలి!!!
**************************************


కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి కవిత అభినందనలు శుభాకాంక్షలు సార్ 🌹🙏🌹👌✍️👏👏