సునంద భాషితం ; వురిమళ్ల సునంద, డల్లాస్
 న్యాయాలు -511
చుచుందరీ సర్ప న్యాయము
*****
చుచుందరీ అనగా చుంచెలుక లేదా సుందెలుక.సర్ప అనగా పాము.
"చుంచెలుకను పట్టుకొన్న పాము వలె"అనగా ఇక్కడ ఓ ప్రత్యేక రకానికి చెందిన ఎలుకను పట్టిన పాము వలె అని అర్థము చేసుకోవాలి.
పాము తాను మామూలు ఎలుకనే పట్టుకున్నాను అనుకుని ఒకోసారి  ఓ ప్రత్యేక రకానికి చెందిన ఎలుకను పట్టుకుంటుంది.ఆ తరువాత గాని అది చుంచెలుక లేదా తనకు ప్రాణహాని చేసే ఎలుక అని తెలుసుకోలేదు.
 అలా చుంచెలుక లేదా  ప్రత్యేకమైన ఎలుక అంటే పాముకు గిట్టదు.అలా పట్టుకున్న తర్వాత   దానిని విడిచి పెడితే దాని ప్రభావం వల్ల పాముకు కండ్లు పోయే ప్రమాదము వుంటుందట.అలా అని భయపడి దానిని తింటే  పాముకు పిచ్చెక్కడంతో పాటు ప్రాణహాని సంభవిస్తుందట.అలాంటి విపత్కర పరిస్థితుల్లో పాము చేయాల్సినది ఏమిటో దానికే అంతుపట్టని పరిస్థితి వుంటుందని అర్థము.
 దీనినే మన వాళ్ళు తెలుగులో "ముందు నుయ్యి వెనుక గొయ్యి" అని,"ఎగదీసిన ఆత్మ హత్య-దిగదీసిన గోహత్య " అనే సామెతతో పోలుస్తూ వుంటారు.
ఇప్పటి వరకు మనకు విషపూరితమైన పాముల గురించి చాలా వరకు తెలుసు. అవి కప్పలను , పాములను పట్టి తింటాయనీ కూడా తెలుసు. 
మరి అలాంటి పాములకు కూడా చెమటలు పట్టించే ఎలుకలు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.అలాంటి ఎలుక గురించి తెలుసుకుందామా...
ఆ ఎలుక పేరే గ్రాస్ హప్పర్ ఎలుక.స్కార్పియన్ హాంప్టర్ అని పిలువబడే ఈ ఎలుక చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందట.చిన్న శరీరం.గుండ్రని ప్రకాశవంతమైన కళ్ళు, బూడిద రంగు వెంట్రుకలతో చూసేందుకు అందంగా కనిపిస్తుందట. కానీ దానిలో చాలా ప్రమాదకరమైన ప్రెడేటర్ అంటే ఇతర జీవులను చంపి తినడం ద్వారా ఎక్కువగా ఆహారం పొందే జంతు గుణం దాగి ఉందని అంటారు.
అవి ఇతర ఎలుకల మాదిరిగా మొక్కలు, విత్తనాలు, కూరగాయలను తినవట.తాజా మాంసాన్ని తినడానికి ఇవి ఎక్కువగా ఇష్టపడుతాయట.తేళ్ళు, పాములు,ఇతర జీవులను సైతం వేటాడేందుకు వెనుకాడవట.
ఈ ఎలుకలు ఉత్తర అమెరికా లోని హాటెస్ట్ ఎడారి అయిన సోనోరాన్ లో ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
విషపూరితమైన పాము కరిచినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదట.ఇవే వాటిని వేటాడి తింటాయన్న మాట.
అయితే ఇలా పాముకు వచ్చిన సమస్యను మన పెద్దవాళ్ళు  రామాయణంలో  దశరథునికి వచ్చిన సంకట స్థితితో పోల్చడం విశేషం.అదెలా అంటే... "అసత్యమాడి కైక మాటలను త్రోసి వేసి రామునికి పట్టాభిషేకం చేయడమా? లేదా కైక వరాల ప్రకారం రాముడిని అరణ్యానికి పంపడమా? అన్నట్లుగా ఉంది" అని.ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలిసిందే.
మరైతే ఈ "చుచుందరీ సర్ప న్యాయము "ద్వారా  పెద్దవాళ్ళు  ముఖ్యంగా మనకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే "ఒకోసారి ఏమీ చేయడానికి వీల్లేని ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా వుండి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని ".
కాబట్టి  మనం  ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.వీరోచితంగా, ఆత్మ విశ్వాసాన్ని పణంగా పెట్టి వాటినుండి బయట పడాలి.ఇదే ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థం.

కామెంట్‌లు