సునంద భాషితం- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -514
ఛాగ పశు న్యాయము
*****
ఛాగ అనగా  మేక పోతు.పశు అనగా జంతువు.
సామాన్యముగా పశు శబ్ధమునకు వృషభాదులు అని అర్థము ఉన్నప్పటికీ వేదాలలో ఒకానొక చోట మేక అని అర్థము కానవచ్చుటచే యజ్ఞములయందు పశు శబ్ధమునకు మేక అనే అర్థమునే వర్తింపజేసి చెప్పడం జరిగింది.
అసలు పశువు అంటే ఏమిటో తెలుసుకుందాం.
పశువు అంటే పాశముతో అనగా తాడుతో కట్టివేయబడిన జంతువులు. అందుకే మన  పెద్దలు కట్టివేసే జంతువులను తప్ప మిగతా వాటిని పశువులు అనరని అంటుంటారు.
ఇక "ఛాగ పశు న్యాయము"ఎలా వచ్చిందో మన పెద్దలు దేనికి అన్వయించి చెప్పారో చూద్దాం.
వేదాలు  ముఖ్యంగా యజుర్వేదం ఈ ఛాగ పశు గురించి అంటే ముఖ్యంగా  పెంచే జంతువుల గురించి చెబుతూ యజ్ఞ యాగాలు చేసే సమయంలో దైవ ప్రీతి కోసం ఏదో ఒక జీవిని బలి ఇవ్వడం వుంటుందని చెబుతుంది.
వేదాలు హిందు మతంలో అత్యంత ముఖ్యమైనవి అందులోని ఆచార వ్యవహారాలను తీసుకుని పాటించడం జరుగుతోంది.అందుకే హిందూ మతంలోని వేద శ్రౌత ఆచారాలలోనూ జానపద, గిరిజన సంప్రదాయాలలోనూ  ఇలాంటివి కనిపిస్తుంటాయి.
కొన్ని మఠాలు,పీఠాల సంప్రదాయం ప్రకారమూ సిక్కు మతంలోనూ  ఈ ఛాగ పశు బలుల గురించి వుంది.కోల్ కతాలోని కాళీ ఘాట్ లో నేటికీ జంతు బలులు జరుగుతునే వున్నాయి.అయితే బౌద్ధ, జైన మతాలు ఇలాంటి జంతుబలులను నిరసించాయి.వ్యతిరేకించాయి.తిరస్కరించాయి కూడా. ఇవే కాకుండా హిందూ  మతంలో కొన్ని గ్రంథాలు కూడా జంతువులను ఆ విధంగా హింసించడం, చంపడం చెడు కర్మగా  ప్రకటించాయి.
అయితే త్రేతా యుగం,ద్వాపర యుగ కాలంలో రాజులు తమ రాజ్యం సుభిక్షంగా ఉండటం కోసం క్రతువులు నిర్వహించే వారనీ.బలి నెపంతో కొన్ని రకాల జంతువులను వధించే వారనీ చరిత్ర చెబుతోంది.
అయితే బలి అంటే అసలైన అంతరార్థం ఏమిటి అంటే పూజార్హత కలిగిన ఒక వస్తువు అని పేరు.
యజుర్వేదంతో పాటు మిగిలిన వేదాలలో సాత్విక బలి అనేది కూడా ఉంది.దాని ప్రకారం గుమ్మడి కాయను, నేతితో వండిన లేదా కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం కూడా  బలి ఇచ్చినంత ఫలితం ఉంటుందనీ, మర్రి, జువ్వి, సరుగుడు లాంటి వస్తువులను మండించడం ద్వారా కొన్ని రకాల వస్తువులు, సుగంధ ద్రవ్యాలను అనగా పచ్చ కర్పూరం,ఇలాచీలు,,అగరు వత్తులు, ఆవు పిడకలు, గంధం, నెయ్యి,నువ్వుల నూనె మొదలైనవి మంత్రాలు చదువుతూ యజ్ఞంలో సమర్పించడం  అనేది సాత్విక బలి అంటారని చెప్పాయి.
ప్రస్తుత కాలంలో కొంతమంది తమ కోరికలు ఆశలు నెరవేరడం కోసం, దైవ సంబంధమైన కార్యాలలోనూ ఇలాంటి  సాత్విక బలులతో యజ్ఞాలు యాగాలు చేయడం మనందరికీ తెలిసిందే.
అయితే ఇంకా  గ్రామ దేవతలు, అమ్మవార్లు, శక్తుల పేర్లతో మేక,కోడి, గేదె, దున్నపోతు లాంటి పశువులను బలి ఇవ్వడం  నేటి సమాజంలో చూస్తూనే వున్నాం.
అసలు యజ్ఞం అంటే నాకు తెలిసి దేవతలకు ముఖ్యంగా  అగ్ని దేవునికి తృప్తి కలిగించేది  అయినప్పటికీ ఇదొక త్యాగం లాంటిదని అర్థం చేసుకోవాలి.మన ఆశలను, విపరీతమైన కోరికలను సాత్వికమైన పద్ధతిలో అగ్నికి ఆహుతి చేయడమే. అంతే కానీ ఇలా జంతువులను బలి ఇవ్వడం కాదు అనేది గ్రహించాలి.
 కాబట్టి ఛాగ పశు పేరుతో  న్యాయము వచ్చినప్పటికీ జంతుబలులను మనమంతా కలిసి వ్యతిరేకిద్దాం.ఒకవేళ అనాదిగా పాతుకుపోయిన నమ్మకాలతో ఇలాంటివి చేయాలనుకుంటే సాత్విక రూపమైన వస్తువులతో  చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము.అంతే కదండీ! మరి మీరు నాతో ఏకీభవిస్తారు కదూ.


కామెంట్‌లు