సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-501
చంద్ర చంద్రికా న్యాయము/ చంద్ర జ్యోత్స్నా న్యాయము
****
చంద్ర అనగా చంద్రుడు, కర్పూరము, నెమలి పింఛంలోని కంటి చిహ్నము, నీరు, బంగారము.చంద్రికా అనగా వెన్నెల, జ్యోత్స్న ,ప్రకాశము నిచ్చునది,చంద్ర భాగానది, మల్లికా లత అనే అర్థాలు ఉన్నాయి.
చంద్రునితో బాటే చంద్రుని  యొక్క 🌙 వెన్నెల.చంద్రుడు లేకపోతే వెన్నెల లేదు. వెన్నెల వచ్చింది అంటే చంద్రుడు ఉన్నట్లే. ఇలా చంద్రుడూ, వెన్నెలా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి.
 
ఇలా వ్యక్తి పుట్టినప్పటి నుంచీ మరణించేంత వరకు ఆస్తి ,అంతస్తు, వైభవంతో వెలిగిపోతూ వుంటే అలాగే ఎవరైనా మొదటి నుండి ఉన్నతమైన వ్యక్తిత్వంతో వెలుగులీనుతూ వుంటే  వారిని ఉద్దేశించి ఈ "చంద్ర చంద్రికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇలా చల్లని వెన్నెల కురిపించే చందమామ గురించి కొన్ని విశేషాలూ, విషయాలను తెలుసుకుందామా...
చందమామ అంటే ఇష్టపడని పిల్లలూ, వెన్నెల అంటే ఇష్టపడని పెద్దలూ ఎవరూ వుండరు.అలా మన అమ్మ అయిన అవనమ్మ తమ్ముడు. మనందరికీ చందమామ ఆత్మీయ మామ.అనురాగ  వెన్నెలలు పంచే అపురూప బంధువు.ఇక చంద్రుని వెన్నెలను వర్ణించని కవులు, రచయితలంటూ వుంటారా ? అంటే అస్సలు ఉండరు గాక ఉండరనే సమాధానం వస్తుంది.
అలా నృసింహ పురాణమును రచించిన ఎర్రన  వెన్నెలను ఎంతో అద్భుతంగా వర్ణించాడు. అలాగే కాళిదాసు శరత్కాల వెన్నెల  గురించి ఎంతో గొప్పగా వర్ణించడం కనిపిస్తుంది.
 ఇలా ఒకరా ఇద్దరా  నన్నయ్య,రామరాజభూషణుడు గారి దగ్గర నుంచి  చలం, తిలక్, నండూరి ఇలా ఎందరో కవులు, రచయితలకు వెన్నెల అత్యంత ఇష్టమైన కవితా వస్తువు.
ఇక వెన్నెల రావడానికి కారణం సూర్యుడు.సూర్యుని కిరణాలు చంద్రునిపై పడి ప్రతిబింబించే కాంతిని వెన్నెల అంటారు. అలా చంద్రుని నుంచి వెలువడే చల్లని వెలుగును వెన్నెల అంటారు.
ఈ వెన్నెల శుక్లపక్షంలో రోజు రోజుకూ పెరుగుతూ , కృష్ణ పక్షం లో రోజు రోజుకు తగ్గుతూ వుంటుంది. అమావాస్య తర్వాత మొదటి వెన్నెల నిచ్చే చంద్రుడిని నెల పొడుపు అంటారు.
 ఇలా చంద్రుడి వెన్నెల ఆనందాన్ని, హాయిని ఇస్తుంది. వెన్నెల కాలంలో ప్రకృతి మరింత శోభాయమానంగా కనిపిస్తుంది.
 
ఈ విధంగా వెన్నెలకూ, చంద్రునికి అవినాభావ సంబంధం ఉంది. అలాంటి వెన్నెలతో మనిషినీ, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని  పోల్చుతూ ఈ "చంద్ర చంద్రికా న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా  చెప్పారన్న మాట.
బంగారానికి తావి అబ్బినట్లు, కళ్ళల్లోంచి వెన్నెల కురియాలి. పెదవులపై వెన్నెల విరియాలి. మాటల్లో వెన్నెలామృతం జాలువారాలి. అప్పుడే మనిషి చందమామలా అందరికీ ఆత్మీయ బంధువు అవుతాడు.
 కొందరు వ్యక్తులు ఉంటారు ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన  పెదవులపై చిరునవ్వు వెన్నెలలు వీడరు.మనిషన్నాక ఇలాంటివి రాకుండా వుంటాయా,ధైర్యంగా అమావాస్యను భరిస్తేనే వెన్నెల సొంతం అవుతుందని చెబుతుంటారు.
ఇలా ఎప్పుడూ చంద్రుడూ- వెన్నెలలా ఉండేవారికి ఈ న్యాయము నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది.
మరి మనమూ "చంద్ర చంద్రికా న్యాయము"ను ఆదర్శంగా తీసుకుని అపర చందమామలమై  అందరి హృదయాలను గెలుచుకుందాం.మీరేమంటారు?

కామెంట్‌లు