శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు 
===============
66.
సత్య మంతయు దెలిసెను స్వాదుమూర్తి!
నీదు మాయలో జగమంత నిండి యుండె 
నీవు లేవను వాదన నిజము కాదు 
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
67.
మనికి నీవని యెఱిగితి మాయవీడి 
నిల్పుకొంటిని మదినిండ నీదు రూపు 
పూజ జేసెద నో దేవ !పుణ్య మిడుమ!
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
68.
హితుఁడ వీవని మనమున నెఱుక కల్గె
భక్తి మీరగ నీదరి పరఁగు దాన
యేలు దొరవని నమ్మితి గృపను జూపి
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
69.
యముని పాశము జుట్టిన యదరి పడుచు
భయము నొందిన వేళల వచ్చి నిలువ
పరుగిడుచురమ్ము!సురనుత!పద్మనాభ!
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
70.
ఆది మధ్యాంత రహిత నీ వవతరించి
దుష్ట శిక్షణ జేయగ దురిత జనులు
పాఱి రందరు నిను గాంచి భయము నొంది
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు