సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, డల్లాస్
 న్యాయాలు -510
చిత్ర తురగ న్యాయము
******
చిత్రము అనగా చిత్తరువు బొమ్మ, ఒక వస్తువు యొక్క ప్రతి బింబము అనే అర్థాలు ఉన్నాయని మనకు తెలుసు.అలాగే తురగము అనగా గుర్రము, అశ్వము,ఘోటకము,హయము అనే అర్థాలున్నాయి.
 మన పెద్దవాళ్ళు చిత్రానలము,చిత్రామృతము,చిత్రాంగన వంటి న్యాయవాదులతో పాటు ఈ "చిత్ర తురగ న్యాయము"ను కూడా వ్యక్తులకు వర్తింపజేసి సృష్టించడం విశేషం.
చిత్ర తురగం అంటే కేవలం బొమ్మలో కనిపించే గుర్రం.చూస్తుంటే వేగంగా పరుగులు తీసే భంగిమలో ఉంటుంది. స్వారీ చేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ దాన్ని స్వారీ చేయలేం. చిత్రాన్ని చూసి ఆలోచనల్లో పడి పోవడమే .అదే నిజమైతే ఎంత బాగుండు.మనమే రౌతులం ఐతే ఎక్కి  ఠీవిగా అలా అలా  తిరిగి వచ్చే వారం కదా అనిపిస్తుంది ఎవరికైనా.ఐతే ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళి మనం చిన్నప్పుడు ఎక్కిన చెక్క గుర్రాన్ని తలచుకుందాం.
ఇప్పుడంటే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న రిమోట్ కార్లు, సైకిళ్ళు వచ్చాయి.కానీ మన చిన్నప్పుడు చెక్క గుర్రం లేదా కీలు గుర్రం అంటే తెలియని పిల్లలు, పెద్దలు ఉండేవారు కాదు.
చిన్న పిల్లలను ఉన్న చోటనే వెనక్కి ముందుకి కదిలే కీలు గుర్రం ఎక్కించి "చల్ చల్ గుర్రం -చలాకి గుర్రం/రాజు ఎక్కే రంగుల గుర్రం/రాణి ఎక్కే జీను గుర్రం/రాకుమారి ఎక్కే రత్నాల గుర్రం/ మా బాబు ఎక్కే కీలు గుర్రం " ఆడిస్తూ ఈ పాట నేర్పేవారు.
కొంచెం పెద్దయ్యాక పిల్లలు తమంతట తామే  దాని పైకి ఎక్కి ఆడుకుంటూ, ఆ పాట ఆడుకుంటూ వుండేవారు.
అలాంటి గుర్రపు బొమ్మలు లేని ఇళ్ళలో పిల్లలు తాత వీపు మీదనో, నాన్న వీపు మీదనో ఎక్కి చల్ చల్ గుర్రం ఆట ఆడుకునేవారు.
ఇక ఇలా ఉన్న చోటనే కదలకుండా కూర్చుని పనికి రాని పెత్తనాలు చేసేవారిని  మన పెద్దలు ఈ "చిత్ర తురగ న్యాయము"తో పోల్చి చెప్పేవారు. పైగా "గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువేం లేదు'" అంటుండేవారు.
అసలు గుర్రం అంటేనే వేగానికి, బలానికి ,స్వేచ్ఛకు,శక్తికి ,చిహ్నం. గుర్రపు స్వారీ చేయడం రాచరిక వైభవానికి ఆనవాలు. అలాంటి గుర్రాలను  కోరికలతో పోలుస్తూ "కోరికలే గుర్రాలైతే" అంటుంటారు. కోరికలు ఆగకుండా గుర్రాల వలె దౌడు తీస్తాయని అర్థం.
 అలా ఒంట్లో బలము,శక్తి ,చేయగల స్వేచ్ఛా ,స్వాతంత్ర్యాలు ఉండి కూడా కేవలం చూపుల గుర్రంలా కనిపించి ఏం లాభం? అనే ఉద్దేశ్యం కూడా ఇందులో ఇమిడి ఉంది.
  
చూపుల గుర్రమో,మేపుల గుర్రమో కాకుండా అరేబియన్ గుర్రంలా  ఉత్సాహంగా,ఉత్తేజంగా మనదైన మంచి నిర్ణయాలు తీసుకుని ఆశయాలు  నిజం  చేసుకునే దారుల్లోకి దూసుకు పోదాం.మనవైన సాహసోపేతమైన నిర్ణయాలు, ఆశయాలు, లక్ష్యాలు మరో నలుగురు ఆదర్శంగా తీసుకునేలా  చూద్దాం.

కామెంట్‌లు