సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -490
గోమయ పాయసీయ న్యాయము
*****
గోమయం అంటే ఆవు పేడ. పాయసము అంటే  పాలతో చేయబడినది,క్షీరాన్నము,పరమాన్నము.
గోమయ పాయసీయ అంటే గోవు పేడ పరమాన్నమవుతుందా? గోవు వలన కలిగిన పాయసము గోమయం అనవచ్చా? అని అర్థము.
ఇందులో రెండు రకాల అర్థాలు దాగి ఉన్నాయి. ఒకటేమో  గోవు ఎంత పవిత్రమైనదైనా, గోవు పాలు ఎంత గొప్ప  మేలు చేసేవి అయినా అది విసర్జించే పేడ  పాయసం కాదు కదా!
ఇక రెండవది  గోవు పాలతో చేసిన  పాయసం ఎంతో రుచికరమైన, పవిత్రమైన భగవంతునికి నివేదించడానికో, తినడానికో చేసిన వంటకం.దానిని  గోమయం అంటామా... అదెంతో తప్పు మాట కూడా.
అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పాయసం పాయసమే ఆ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. పెట్టుకోకూడదు కూడా.
ఇక గోవు పేడ గోవు పేడే.గోవు విసర్జించిన మలం అది.అది పాయసం ఎలా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు.పేడను పేడ లాగే చూడాలి.పాయసాన్ని పాయసం లాగే చూడాలి.ఆ రెంటికీ ముడిపెట్టడం  పోల్చడం సరికాదు అని అర్థము.
అలా ఆలోచించే  ముడిపెట్టే వ్యక్తులు ఎవరైనా మూర్ఖులతో సమానం అంటారు మన పెద్దలు. అవును కదా! ఖచ్చితంగా మూర్ఖత్వమే.అందులో ఎలాంటి సంశయమూ, మరో మాట లేనేలేదు.
 దీనికి దగ్గరగా మనవాళ్ళు చెప్పే సామెత" పిల్ల ముద్దు గాని, పిల్ల విసర్జించే మలం ముద్దా" అని.
 పిల్లలంటే ఇష్టపడని వారుండరు.వారి  పసి చేష్టలను చూసి ఆనందించని వారుండరు. మరీ నెలల పిల్లలైతే ఎంతగానో ముద్దొస్తూ వుంటారు.
 అలా వారి ఉంగా ఉంగా ముచ్చట్లు,బోసి నవ్వులు చూసి ముద్దు చేస్తుంటాం.మనల్ని మనం మైమరచి పోతుంటాం.
అంతే కాని వాళ్ళు విసర్జించే మలాన్ని ముద్దు చేస్తామా చేయము కదా!
ఈ పాటికి ఎప్పుడో అర్థమై పోయింది కదండీ!మంచిని మంచిగానే చూడాలి. చెడును చెడు గానే చూడాలి.
 దీనిని మరో కోణంలో కూడా చూడొచ్చు. ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులు పరిచయం అయినప్పుడు సంతోషించడం,గొప్పగా అనుకోవడంలో తప్పు లేదు.కాని ఆయా వ్యక్తుల్లో ఉన్న  లోపాలను అనగా చెడు అలవాట్లను సహించాల్సిన అవసరం లేదనేది గుర్తుంచుకోవాలి.
ఇదే ఈ "గోమయ పాయసీయ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు.మంచిని మంచిదిగా, చెడును చెడుగానే చూడాలి.అంతే గాని వాటికి భిన్నంగా చూడకూడదు. ఆలోచించ కూడదు.

కామెంట్‌లు