తెలుగు దివ్వె;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 చీకటిలో దివ్వె అతడు 
ఆకసమున అరుణుడతడు
"అతడాంధ్రుల హృదయాంతరాన 
దాగిన మహదాశయమ్ము"
అని దాశరథిగారన్న మాటలు 
నిజంచేసి తెలుగు ప్రజల గుండెల్లో 
మాతృభాషాభిమానాన్ని కలిగించిన 
తెలుగుదివ్వె అతడు
తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి 
పునాదివేసిన వెలుగుమూర్తి అతడు
తెలుగు సాంస్కృతిక,సారస్వత 
అనురక్తిని కలిగించే సురుచిరవేదికగా
గోలుకొండపత్రికను తీర్చిదిద్దిన మహనీయుడతడు
ప్రథమాంధ్రమహాసభను జోగిపేటలో ప్రారంభించి
త్రయోదశ సభలను ఒక్కచేతిమీదుగా 
దిగ్విజయం చేసిన మాన్యుడతడు
విజ్ఞానవర్ధినీ పరిషత్తు,ఆంధ్రసారస్వత పరిషత్తు,
ఆంధ్రవిద్యాలయం, కృష్ణదేవరాయాంధ్రభాషానిలయం,
లక్ష్మణరాయపరిశోధకమండలి,
ఆంధ్రభాషానిలయం,రెడ్డిహాస్టల్ వంటి సంస్థలతో 
ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న 
తెలుగువైభవమూర్తి అతడు
సంపాదకుడిగా, సంస్కర్తగా, విమర్శకుడిగా, 
పరిశోధకుడిగా,కవిగా,రచయితగా 
సారస్వతహాలికుడై అనన్యసేవలందించిన 
తెలుగువైతాళికుడతడు
ఎన్నితరములైనా పాతవడనిసృష్టికి ఆద్యుడతడు
అతడె సురవరంప్రతాపరెడ్డి 
తెలుగుప్రజలకందిన బంగారుకడ్డి!!!
**************************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
అన్ని మంచి కవితలు మీవి. చదివినకొద్దీ చదువాల👌👏👏🌹నిపిస్తున్నాయి. అభినందనలు శుభాకాంక్షలు సార్. 👌