సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -488
గోపుచ్ఛ న్యాయము
*****
గో అంటే ఆవు, భూమి, వాక్కు , సరస్వతి,తల్లి, దిక్కు , ఎద్దు,కిరణము, స్వర్గము, చంద్రుడు, వజ్రాయుధము,కన్ను.పుచ్ఛ అంటే తోక, వాలము, నెమలి తోక వెనుక భాగము అనే అర్థాలు ఉన్నాయి. 
ఆవు తోక మొదట లావుగా వుండి క్రమముగా సన్నగిల్లి చివర్లో  మొనదేలి వుంటుంది.
దీనిని విచారణ చేయడం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఒక్కో జంతువు తోక ఒక్కో రకంగా ఉండటమనేది సహజం.అలాంటిది ప్రత్యేకంగా ఆవు తోక గురించి మన పెద్దవాళ్ళు చెప్పారంటే తప్పకుండా అందులో  ఏదో ఒక విశేషం ఉండే తీరుతుంది.
ఎలాగూ గోవు తోక సందర్భం వచ్చింది కాబట్టి జంతువులకు తోకలు ఎందుకు? ఎలా ఉపయోగపడతాయో నాలుగు మాటలు మాట్లాడుకుందాం.
ఈ ప్రకృతిలో అనేక రకాల జంతువులు పక్షులు ఉన్నాయి.వాటిల్లో పక్షుల తోకలు ఒక రకమైతే, జంతువుల తోకలు మరో రకం.ముఖ్యంగా వేటాడే జంతువులు తమ తోకలను ఆయుధాలుగా ఉపయోగిస్తాయి.కొన్ని జంతువులు తమ తోకలను చెట్లు ఎక్కడానికి, కొమ్మలను గట్టిగా  పడిపోకుండా పట్టుకోవడానికి, నిటారుగా ఉండటానికే కాకుండా  వెచ్చని దిండుగా కూడా ఉపయోగించుకుంటాయి.
మరికొన్ని జంతువులు తమ ఒంటిపై వాలే ఈగలు, దోమలు, దుమ్ము ,ధూళి,పురుగులు మొదలైన వాటిని వెళ్ళగొట్టడానికి తోకల్ని విదిలించడం చూస్తుంటాం.
అన్ని జంతువుల తోకలు  ఒక్కో విధంగా ఉంటాయి.అయితే ఆవు తోక ఈ న్యాయములో చెప్పుకున్న విధంగా  చివర్లో మొనదేలి బాణం ములికిలా వుంటుంది.
ఇలా వుండటాన్ని మన  పెద్దలు నిశితంగా గమనించి  కుక్కతోకను  మనిషి స్వభావానికి ముడిపెట్టినట్లే ఆవు తోకను కూడా మనిషి స్వభావానికి ముడిపెట్టి చెప్పారు.అదెలాగో చూద్దాం.
"కుక్క తోక వంకర  ఎంత చక్కచేసినా  వంకర పోదు అన్నట్లు కొందరు వ్యక్తులు ఎంత చెప్పినా వారి వక్రబుద్ధి మార్చుకోరని అంటుంటారు కదా! అలాగే ఆవు తోకలా కొందరు వ్యక్తులు మాట్లాడే విధానం కానీ, వారి ప్రవర్తన కానీ చాలా విశాలమైన భావాలను కలిగి వున్నట్లు అగుపిస్తుంది.కానీ వాళ్ళతో సన్నిహితంగా మెలిగిన వారికి, తరచూ  వారితో సంభాషణలు ,సంబంధ బాంధవ్యాలు కలిగిన వారికి  ఆయా వ్యక్తుల విశాలత్వం మొదట చూసినట్టుగా ఉండదని అర్థమవుతుంది.
 ఇలా విశాలత్వం నుండి రాన్రానూ  ముక్కు సూటితనం, నిక్కచ్చితనం కనిపిస్తాయి.అలా వుండే వారిని ఉద్దేశించే మన పెద్దవాళ్ళు ఈ "గో పుచ్ఛ న్యాయము"ను ఉదాహరణగా చెప్పి వుంటారని అర్థమై పోయింది కదా.
అయితే  కొందరు కొన్ని జంతువుల తోకలు, వాటికి ఉన్న వెంట్రుకలు చాలా పవిత్రమైనవనీ వాటితో ఇలా చేస్తే బాగుంటుంది,అలా  వాటిని దాచుకుంటే బాగుంటుంది అంటుంటారు.ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారివి.
 మనకు "గోపుచ్ఛ న్యాయము" అంటే ఏమిటో తెలిసి పోయింది కదా! అలాంటి వ్యక్తులు తారసపడినప్పుడు ఈ న్యాయమును గుర్తు చేసుకుందాం. ఏమంటారు?.

కామెంట్‌లు