శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు.
==============

61.
విలువ లేనట్టి కోర్కెలు విడువలేక 
తనువు శాశ్వతమనుకొంటి, తప్పుగాచి 
పరము నిచ్చుచు నీదివ్య పథము జూపి 
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
62.
దేవదేవ !నీ యునికిని తెలియలేక 
వెదకి చూచితి జగమంత విధులుమఱచి 
కనులు మూసిన నీరూపు కదలు చుండె 
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
63.
కల్మషంబులు మదినిండ గప్పివేసె 
దీప కాంతిగ చెలువొంది దేహ మందు
శుద్ధి జేయగ రావయ్య!శోభనాంగ!
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
64.
దారి దప్పితి ధర్మమున్ మీరి యుంటి 
మూఢ మతులను జేరితి మోసపోయి 
దిశను జూపంగ రా స్వామి !దిక్కు నీవె!
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
65.
పాప కర్మలు జేసితి భయము లేక
నిండ మునిగితి నో దేవ!నీతి నేర్చి
మారి పోవఁగ నీయవే మంచి బుద్ధి
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు