మత్తకోకిల మాతృగీతము - రాయప్రోలు సీత రామ శర్మ.,-భీమవరం
  🚩మత్తకోకిల ఛందస్సు

   మత్తకోకిల మత్తకోకిల మాతృగీతము పాడవే!
  మత్తులన్నియు వీడిపోవుచు
మానసంబులు హాయిగా
    చిత్తుసత్తులె యేకమై ధర చిన్మయంబున ప్రాణులన్
    యెత్తిపెంచగ మాతయౌనని, యింపు గానము సేయవే! (1)

   మాతకంటెను వేరెదైవము క్ష్మాతలంబున లేదనున్
    ప్రాతదౌ శ్రుతిసూక్తమే మది రాజిలంగను నెమ్మదిన్
    నీతిగా తమ మాతృమూర్తిని
నిర్మలాత్మల కొల్వగా
    చేతమొప్పగ గానమాధురి చింద పాడవె కోకిలా! (2)

    మాతృమూర్తికి వందనం! మన మాతృమూర్తికి చందనం!
   చేతమందున పిల్లలెల్లరు శ్రేయ మందగ కోరుచున్
    ప్రీతితో కడుఓర్పుతో పలు రీతులందున సేవలే
    క్ష్మాతలంబున దేవతే యన సంచరించెడు నాతికిన్. (3)

    కరుణ మీయిల, రూపమందిన కైవడిన్ దిరుగాడుచున్
    అరయ త్యాగమె ఆచరించెడు అందమాకృతి దాల్చెనా
    ధరణియందున గేహ గేహము దైవమట్టులు మెల్గునా
   వరదయౌ,
మనమాతృమూర్తికి వందన మ్మభినందనం! (4)

     దైవ మీ వసుధాతలంబున దా చరియింప నెల్లెడన్
     ఏ విధంబని యెంచి నెమ్మది నీ  విధిన్ మనమాతయై
     సేవలందిడ మేలుమేలని శ్రేష్ఠ మంచు తలంచెనో
     లో విసుంగదిలేక నవ్వుచు లోకితౌ గదతల్లియే. (5)

    అనుచు మేలగు రీతు లన్నియు అందమొందెడు రీతిలో
మనసు లార్ద్రత నందుచున్ వడిమాతృసేవకు పూనగా
    మనిషి రాయిగ మారకుండగ మంచిమార్పున నొప్పగా
    అన విపంచిగ పాడుమా! మహి కందమేర్పడ కోకిలా! (6)

  🚩మాతృ దేవోభవ!

కామెంట్‌లు