పూలు పూచాయి;- ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
అదిగో అటుచూడండి. పూలు పూచాయి. అందంగా ఉన్నాయి ' అన్నాడు ఓ కవి.

'ఎక్కడ కవీశ్వరా! ' అని టక్కున అడిగాడు ఓ పాఠకుడు.

అప్పుడు కవిగారు ఇలా అన్నారు. ' ఎదురుగా ఉన్న పూలతోటను చూడు. పచ్చగా ఎదిగిన మొక్కలనుచూడు. కొమ్మారెమ్మలను చూడు. అవి పూసిన పూలను చూడు. ఆనందించు ' అన్నాడు కవి.

పాఠకుడు చూచి సంతోషించాడు. కవితో ఇలా అన్నాడు. ' కవిగారు, అక్కడే కాదు, ఇక్కడా కూడా పూచాయి ' అన్నాడు. 'ఎక్కడా ఎక్కడా ' అని ఆత్రంగా  అడిగాడు కవి.

పాఠకుడు ఇలా అన్నాడు. ' మీ మదిలో సాహిత్యవనం కనిపిస్తుంది. కవితా వృక్షాలు కనిపిస్తున్నాయి. ఆ చెట్లనిండా వివిధ రంగుల కైతాపుష్పాలు కనిపిస్తున్నాయి. సువాసనలను చల్లుతున్నాయి ' అని అన్నాడు.

ఈ మాటలు విన్న ఓ తల్లి ఇలా అన్నది. ' మా ఇంట్లో కూడా రెండు విరులు వికసించాయి. చూడండి. మా పిల్లల మోముల్లో నాకు చక్కని సుమాలు కనబడుతున్నాయి. చూడండి ' అన్నది. కవి పాఠకుడు చూచి ఆశ్ఛర్యపోయారు.

అప్పుడు ఓ పిల్లవాడు ఇలా అన్నాడు . 'తలపైకెత్తి ఆకాశంలోకి చూడండి. అక్కడ కూడా పూలు కనిపిస్తున్నాయి. చందమామను చూడండి, తారకలను చూడండి. మిలమిలా తళతళా మెరిసిపోతున్నాయి. పూదోటకు మించిన సోయగాలను చూపిస్తున్నాయి ' అన్నాడు. దర్శించి కవి, అమ్మ, పాఠకుడు మురిసిపోయారు.

ఆ మాటలు విన్న చంద్రుడు ఇలా అన్నాడు ' అక్కడ కూడా చాలా కుసుమాలు పూచాయి. అటు చూడండి. ఆ కవి గారి వ్రాసిన సుమ సౌరభాలు పుస్తకాన్ని చదవండి. పుటలనిండా పూలు పూచి పరిమళాలు చల్లుతున్నాయి. మదులను దోచుకుంటున్నాయి '. 

అదివిన్న వారంతా పకపకా నవ్వారు. పొంకాలు చూపారు. పరిమళాలు వెదజల్లారు.

ఔను. పూలకు ఎన్ని పేర్లు. ఎన్ని తావులు. ఎన్ని రంగులు. ఎన్ని సోయగాలు. ఎన్ని పరిమాణాలు. ఎన్ని ఆకారాలు. ఎన్ని సుగంధాలు. పువ్వులు పరమాత్ముని పాదాలుచేరి పరవశిస్తాయి. కోమలాంగుల కొప్పులుచేరి కుతూహలపరుస్తాయి. ప్రేమికుల చేతులు మారి ప్రేమను వ్యక్తపరుస్తాయి. హారాలై మెడలను చుట్టుకుంటాయి. చూపరులను ఆకర్షిస్తాయి, ఆహ్లాదపరుస్తాయి.

పుష్పాలు పూచాయి, పూస్తున్నాయి, పూస్తూనే ఉంటాయి.
పూలు ప్రకృతికి ప్రతీకలు. పూలను చూద్దాం. పులకరించిపోదాం.  


కామెంట్‌లు