సుప్రభాత కవిత -బృంద
ప్రశాంతమైన కెరటాల సవ్వడి
భూపాలంలా వినిపిస్తోంది
తూరుపు వేదిక బంగరు తెరలు
తీసి వెలుగుల వేకువను
మురిపెంగా పిలుస్తోంది

కాలికింద కదులుతున్న
సన్నటి ఇసుక 
పాదాలను వదలక
కాసేపు కబుర్లు చెప్పమంటోంది

మేఘాల మాటున దాగిన
బింబపు దర్శనానికై వాకిటిలో
వేచిన అభిసారికలా  కొబ్బరిచెట్టు
వంగి మరీ చూస్తోంది

తెలియని ఆనందపు వీచికలు
తెలివెలుగులతో ముచ్చటిస్తూ
ప్రియమైన  భావనలను
మనసంతా నింపేస్తోంది

కోరిన కోరికలన్ని తీరేలా
కలతలు కరిగి తొలిగేలా
కన్నుల పండుగ  కలిగేలా
తొలకరి ఆనందం కురిపిస్తూ

కదిలివచ్చే కమ్మని వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు