అనగనగా రామాపురంలో రాజారాం అనే పెద్ద రైతు ఉన్నాడు. అతడు తన పొలంలో జొన్న పంట వేశాడు. పంట ఏపుగా చాలా బాగా పండింది. ప్రతిరోజు పిచ్చుకలు వస్తు జొన్నలు తింటుంటాయి. అందులో ఒక పిచ్చుకమ్మ అక్కడే జొన్న చేనులో ఒక గూడు కట్టుకుని, అందులో కొన్ని గుడ్లు పెట్టి పిల్లలు చేసి అక్కడే నివసిస్తుంది. తల్లి పిచ్చుక పిల్లలకి ఆహారం తేవడం కోసం రోజూ ఉదయం పూట గూడు lనుండి బయటకు వెళ్లి మరల సాయంత్రం వస్తుంది. అంతవరకు పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్పి గూడు నుండి బయటకు రావద్దు అని పిచ్చుకమ్మ చెప్పి వెళ్తుంది. సరే !
అన్నాయి పిల్లలు. ఒకరోజు రైతు రాజారాం కొడుకుని పొలం కి తీసుకువచ్చి నాయనా! జొన్నలు బాగా పండాయి రేపు చేను అంతా కోసి మన ఇంటికి పట్టుకు వెళ్లాలి అని చెప్పాడు. ఆ మాటలు విన్న పిచ్చుక పిల్లలు భయపడుతూ ఉన్నాయి. తల్లి పిచ్చుక సాయంత్రం వచ్చింది. పిల్లలతో ఎందుకు అలా భయపడుతున్నారు అని అడిగింది. అమ్మ! రైతు వచ్చి రేపు చేను అంత కోయమని తన కొడుకుతో చెప్పాడు అందుకే మన గూడు అంత పోతుందని భయంగా ఉంది అన్నాయి. హా! ఏమీ కాదు మీరేమీ భయపడకండి అని చెప్పి మళ్ళీ ఉదయం తల్లి పిచ్చుక మేత కోసం బయటికి వెళ్ళింది. సాయంత్రం తిరిగి వచ్చింది పిచ్చుక పిల్లలు భయంతో వణుకుతున్నాయి గూడు అంతా బాగానే ఉంది కదా మళ్లీ ఎందుకు భయపడుతున్నారని అడిగింది తల్లి. అమ్మ,! అమ్మ! మళ్లీ రైతు వచ్చి కొంతమంది మనుషులని తెచ్చి పంట అంతా రేపు కోయాలి అని చెప్పాడు. ఓ! అదా సంగతి, మరి ఏమీ పరవాలేదు పిల్లలు మీరేమీ భయపడకండి అని మరలా పిచ్చుకమ్మ ఉదయం మేతకు బయలుదేరింది పిల్లలతో నేనున్నాను మీకు ఏమి భయం లేదు జాగ్రత్తగా ఉండండి అని ధైర్యం చెప్పి వెళ్ళింది. సాయంత్రం వచ్చేసరికి పిల్లలు చాలా భయంతో వణుకుతున్నారు ఏమీ కాలేదుగా ఎందుకు భయపడుతున్నారు అంది తల్లి. అమ్మ! ఈరోజు కూడా రైతు వచ్చి ఎవరి వలన ఈ పని జరగడం లేదు పంట అంతా బాగా పండింది రేపు నేనే కొంతమంది పని వాళ్ళని తెచ్చి చేను కోసి ఇంటికి పట్టుకు వెళ్లాలి అని అన్నాడు. ఓహో!! అలాగా! అని తల్లి పిచ్చుక వెంట వెంటనే తన గూడుని చెట్టు మీదకి మార్చేసింది. అప్పుడు పిచ్చుక పిల్లలు ఎందుకమ్మా!! మేము రోజు చెబుతున్న పట్టించుకోలేదు ఈరోజు వెంటనే గూడు మార్చేశావు అని అడిగాయి అప్పుడు పిల్లలు! తన పని తానే చేస్తానని రైతు పూనుకున్నప్పుడు అది తప్పకుండా జరుగుతుంది అని తల్లి పిచ్చుక చెప్పింది నిజంగానే తల్లి చెప్పినట్టుగా రైతు మరుసటి రోజు చేను అంతా కోసి పంటను ఇంటికి పట్టుకుని వెళ్ళాడు. పిల్ల పిచ్చుకలు నిజమే అమ్మ చెప్పిన మాట అనుకున్నాయి.
నీతి:: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకోకూడదు మన పని స్వయంగా మనమే చేసుకోవాలి అప్పుడు ఆ పని కచ్చితంగా జరుగుతుంది..
------------------
అమ్మ మాట పూలబాట..;- బల్ల కృష్ణ వేణి -పలాస
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి