ఊహల కౌగిలిలో!;- పద్మావతి పి-హైదరాబాద్
కుసుమ ధర్మన్న కళా పీఠం 
-------------------------------------------
ఊహల పల్లకిలో ఊయలలూగుతూ విహరిస్తున్నా
కనురెప్పల కౌగిలిలో బంధించి పరవశ నౌతున్నా..

నీ అడుగుల సవ్వడికై క్షణమొక యుగంగా గడుపుతున్నా 
మదిలో రేగే తపనల అలజడిని నేనోపలేకపోతున్నా..

నీ మోవిపై విరిసిన చిరునవ్వుల వెన్నెల్లో 
నను నేనే మైమరచిపోతున్నా

అధర సుధామృతమై ఎద మీటిన ఆ మురళీ రవం 
మదిలో నింపెను తీయని స్మృతుల కలవరం

సెలయేరుల గలగలలై కనుగీటిన ఆ అల్లరి చేష్టలు 
మువ్వల అందెల సవ్వడి దరి రమ్మని సైగలు చేస్తుంటే
బుగ్గల సిగ్గుల్లో వెదజల్లిన మల్లెల పరిమళమై,

అణువణువునా నింపుకున్న  నీ మోహన రూపం 
వలపుల తలపులతో కవ్విస్తుంటే, 

కృష్ణా! నా మనసున నిండిన తీయని భావం ముదముగా 
గుండెలనిండా నింపిన ప్రణయ సుధామృత రాగం..

నీవే నేనని, నీవు లేని నేను లేనే లేనని 
నీ తోడిదె లోకమని, హృది దోచిన మాధవుని జాడేదని!
ఒకే శ్వాసగా ధ్యాసగా నిన్నే వలచిన ఊహల కలలతో జీవిస్తున్నా !!

కామెంట్‌లు