సునంద భాషితం;-వురిమళ్ల సునంద, డల్లాస్

 న్యాయాలు -513
 చోరాపహార్య న్యాయము
*****
చోరా అంటే దొంగ. అపహార్యం అనగా ఎత్తుకొని పోవుట,పోగొట్టుట,దొంగిలించుట అనే అర్థాలు ఉన్నాయి.
దొంగయు,దొంగిలింపబడినవి పరస్పరము భిన్న ములైనప్పటికీ వేరు కావు అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఉదాహరణకు జీవేశ్వరులు అనగా జీవుడు మరియు ఈశ్వరుడు.
చెట్టును,పుట్టనూ, జంతువులు, పక్షులను పూజించడం ఆదిమ కాలం నుంచి వస్తోంది. దైవభక్తి ఎక్కువగా ఉన్న మన పూర్వీకులు మనిషి జీవితాన్ని ఆత్మ, పరమాత్మ తో జీవుడు,జీవేశ్వరునితో ముడిపెట్టడం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత మొదలైనవి చదివినప్పుడు అవగతం అవుతుంది.అందులోంచే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక వాదులు ఉదయించారు.అందులోంచి వచ్చిందే ఈ న్యాయము.
మరి ఇక ఆధ్యాత్మిక వాదుల దృష్టితో ఈ న్యాయమును చూద్దామా...
ముందుగా జీవుడు,ఈశ్వరుల మధ్య ఉన్న సంబంధం ఏమిటో గమనిద్దాం.
 ఈ ప్రపంచం లేదా జగత్తు అంతా రకరకాల జీవులతో నిండి ఉంది.ఈ జీవులే లేకపోతే  అసలీ జగత్తనేదే లేదు అంటారు. జీవుడు ఈ జగత్తులో పుట్టడం వల్ల జగత్తు పట్ల విపరీతమైన మమకారం, వ్యామోహం పెంచుకుంటాడు.
ఎప్పుడైతే జీవుడు తన నిజమైన స్వరూపాన్ని, అర్థాన్ని తెలుసుకోగలడో అప్పుడే ఈశ్వరుని సన్నిధిని పొందగలడు. ఈశ్వరత్వాన్ని ఆవాహన చేసుకుని జీవేశ్వరుడు కాగలడు అంటారు.
జీవుడు నదిలా ఎంత ప్రయాణం చేసినా చివరికి చేరాల్సిన గమ్యం సాగరమే అనగా ఈశ్వరుని లోనే.
 ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువునైనా,వ్యక్తినైనా,మరెవరినైనా సూచించాలంటే వారికి ఓ పేరు అనేది తప్పకుండా ఉండాలి. ఆ పేరును సూచించేదే పదం.ఆ పదం పలకడం అంటే శబ్ద రూపంలో అనగా  సంకేతంతో చెప్పడం.
 అలాగే జీవుడు అనే వాడిని నాలుగు అవస్థలలో అన్వయించి చెబుతూ బాహ్య ప్రపంచంలోని విషయాలను గ్రహించి మనస్సుకు అందజేసే మొదటి అవస్థ లేదా స్థాయిలో  వైశ్వానరుడని,విశ్వుడని పిలవబడతాడు.ఇతడు స్థూల శరీరంతో ఉంటాడు.
ఇక రెండవ అవస్థ లేదా స్థాయిలో ఉన్న జీవుడిని తైజసుడు అంటారు.అంటే స్వప్నావస్థలో అంతఃప్రజ్ఞతో సంచరించే వాడు.ఇతడు తేజోమూర్తియై వుంటాడు. స్వప్నావస్థలో పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పని చేయవు.కేవలం మనసు మాత్రమే పని చేస్తుంది.
ఇక మూడోది సుషుప్తి అవస్థ.ఈ అవస్థలో ఉన్న జీవుడిని ప్రాజ్ఞుడు అంటారు. ఈ అవస్థలో జీవుడు అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందుతాడు.
ఇక నాలుగోది తురీయావస్థ. ఈ అవస్థలో ఉన్న జీవుడిని తురీయుడు అంటారు. ఈ అవస్థలో ఉన్న జీవుడికి ప్రాపంచిక వ్యవహారాల పట్ల గానీ,జగత్తుతో గానీ ఎలాంటి సంబంధం ఉండవు.ఈ స్థితిలోనే పరమాత్మయైన ఈశ్వరుడిలో ఐక్యం అవుతాడు.
 శివుడినే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, సదాశివుడు అంటారు.ఇంకా ఆద్యంతాలు లేని వాడు.రూపాతీతుడు.త్రిగుణాతీతుడు.
పంచకార్యములను నిర్వహించడానికి తన నుండే వివిధ రూపాలను సృష్టించుకుని వారికి ఆత్మగా తానే అన్ని అయి నడిపించే వాడు.అందరికి, అన్నింటికీ ప్రభువు ఈశ్వరుడు.
 అలా ఈశ్వరుడు సృష్టించిన రూపాల్లోని  వాడే జీవుడు. కాబట్టి జీవుడికి, ఈశ్వరుడికి భేదం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ న్యాయం ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇలా  మన మనసు,శరీరాలను నడిపించేది ,తనలో ఐక్యం చేసుకునేది ఈశ్వరుడేననీ.
ఆత్మ, పరమాత్మ బంధం లాంటిదే.
 "జీవునికి ఈశ్వరునికి మధ్య ఉన్న సంబంధాన్ని  గ్రహించి, ఇష్టమైతే ఆధ్యాత్మికమైన భావనతో జీవిద్దాం. అవన్నీ ఎందుకనుకుంటే  మానవీయ విలువలతో సాటి వారికి స్నేహ హస్తం అందించి జీవితాన్ని జీవేశ్వర తత్వంతో జీవితం కొనసాగిద్దాం.


కామెంట్‌లు