తీపి జ్ఞాపకాలు ; - ప్రమోద్ ఆవంచ= 7013272452

 శ్యామల గారు.....
నుదిటిపై పెద్ద కుంకుమ బొట్టు  పెట్టుకొని,పెద్ద అంచు చీర కట్టుకుని,ఎప్పుడూ ముఖంపై చెదరని, చిరునవ్వుతో ఎక్కడ ఎవరు కలిసినా కలివిడిగా మాట్లాడుతూ, వాళ్ళ యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటుంది.అమ్మలా ప్రేమను పంచుతుంది.అక్కలా స్నేహంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఆమె మనింట్లో మనిషిగా ఉంటుంది.పిల్లలతో కలిసినపుడు వాళ్ళ చదువుల విషయంలో అనేక సూచనలు చేస్తూ కౌన్సెలింగ్ చేస్తుంది.పేద విద్యార్థులు
చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తుంది.అది వాళ్ళ
నాన్న ఊర్లో ఎంతో మంది పిల్లలకు చదువుకై సహాయం
చేస్తుండడం చూస్తూ పెరిగింది,తాను ఆచరిస్తుంది.
చదువుకోవడానికి ఆసక్తి ఉండి, డబ్బులు లేని ఎంతో మందికి తాను, తనకున్న దానిలో ఆర్థిక సహాయం చేసేది.
శ్యామల గారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, తాను
ఫలానా వాళ్ళకు సహాయం చేసినట్లు ఎవరికీ చెప్పదు.
అదే ఆమె గొప్పతనం.జీవితంలో ఎన్నో ఆటుపోటులను
ఎదుర్కొంది.కష్టం విలువ తెలిసిన వ్యక్తి.కుటుంబంలో
ఇద్దరు అన్నయ్యలు,ఒక అక్క.తనతో కలిసి నలుగురు.
శ్యామల గారు,ఆమె భర్త శివానంద్ గారు,ఇద్దరూ గచ్చీబౌలీ లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు.అయిదు సంవత్సరాల క్రితం శివానంద్ గారు అనారోగ్యం కారణంగా పరమాత్మలో ఐక్యం అయ్యారు.అప్పటి నుంచి ఆమె డల్ అయ్యారు.శ్యామల గారికి ఒక కొడుకు పేరు  హేమంత్, పెళ్లి అయ్యింది.కోడలు రైల్వే ఉద్యోగి.హేమంత్ కి ఒక కొడుకు.శ్యామల గారు ప్రస్తుతం నాయనమ్మ అయ్యింది.ఇంకో సంవత్సరంలో పదవీవిరమణ అవుతుంది.రిటైర్ అయ్యాక మనవడి చూసుకుంటూ ఉంటాననీ నేను కలిసినప్పుడు చెప్పింది.
                    రెండు వేల ఎనమిదవ సంవత్సరంలో నేను
చైతన్యపురిలో ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాణ్ణి.ఆ అపార్ట్మెంట్ పేరు సాయి మారుతీ ఎన్ల్కేవ్.అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో శ్యామల గారి కుటుంబ ఉంటుండేది.నేను సెకండ్ ఫ్లోర్ లో ఉండేది.ఆ అపార్ట్మెంట్ లో అందరూ ఒకే కుటుంబంలా కలిసి ఉండేవాళ్ళు.ముఖ్యంగా వినాయక
చవితి సందర్భంగా తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం.అందరూ
సాయంకాలం వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల నుంచి వచ్చాక
పూజకు ముందు రకరకాల ఆటలు,పిల్లల కేరింతలతో
అపార్ట్మెంట్ అంతా కళ కళలాడుతూ ఉండేది.ప్రతి రోజు ఒక్కొక్కరు తమ ఇంట్లో ప్రసాదాలు తయారు చేసుకొని వచ్చేవారు.ఆ ప్రసాదాలు తిన్న తర్వాత ఇక డిన్నర్
అవసరం ఉండేది కాదు.ఇలా అందరూ ఒక దగ్గర కలిసి
ఒకే కుటుంబంలా కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఒక మంచి
సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు.సురేష్,, శ్రీధర్,
సుధాకర్ రెడ్డి,హనుమంతరావు, సుబ్రహ్మణ్యం,రాము,
శివానంద్, శ్రీనివాస మూర్తి దంపతులు,అందరు పూజలో పాల్గొనేవారు.నిమజ్జనం రోజు డాన్సులు చేసుకుంటూ వీధి చివరి వరకు వెళ్ళి ఆడవాళ్ళు వినాయకుడి వాహనంలో కూర్చునే వారు.ఆ తరువాత సరూర్ నగర్ చెరువులో నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళం,ఆ సాయంత్రం ఒక డిన్నర్ అరేంజ్ చేసే వాళ్ళు.ఆ డిన్నర్ తింటూ అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం ఎంత అద్భుతమైన సాంప్రదాయం.బందువులు కాదు, స్నేహితులు అంతకన్నా కాదు, కేవలం ఒక అపార్ట్మెంట్ లో
ఇల్లు కొనుక్కుని పక్క, పక్కన ఉన్నందున పెరిగే స్నేహం,
పక్క ఫ్లాట్లో వాళ్ళకు ఇబ్బంది వస్తే వెళ్లి పలకరించడం,
కొన్ని సమయాల్లో అవసరమైతే ఆర్ధిక సహాయం చేయడం
హాస్పిటల్ లో అడ్మిట్ అయితే కుటుంబ సమేతంగా వెళ్లి
ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావడం,ఎవరి ఇంట్లో అయినా శుభ కార్యాలు జరిగితే అపార్ట్మెంట్ అంతా కదిలి రావడం, స్వంత బందువులు కూడా ఇలా ఉండరు ఎంత మంచి కల్చర్ కదా.....ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది . రకరకాల మనుషులు, అనేక రకాల వ్యక్తిత్వాలు, కానీ ఏ ఒక్కరికి ఆపద వచ్చినా అందరూ మానవత్వంతో ఆలోచిస్తారు.ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.సహాయం అంటే ఆర్ధిక సహాయం అని కాదు.... ధైర్యం చెప్పేవాళ్ళు, నీకేం కాదు మేమున్నాం అనీ నిలబడే వాళ్ళు.ప్రస్తుత సాఫ్ట్వేర్ కొలువుల మూలంగా పిల్లలు ఎక్కడో, తల్లిదండ్రులు ఎక్కడో....ఇక్కడ తల్లిదండ్రులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మొట్టమొదటగా అటెండ్ అయ్యేది ఇరుగుపొరుగు వాళ్ళే ఇది సత్యం.ఇంకా సమాజంలో మానవత్వం ఉంది అనడానికి రుజువు....కట్ చేస్తే.....
                    నేను హాస్పిటల్ లో పనిచేస్తుండడం అదీ
యశోద హాస్పిటల్ లో పనిచేయడం వల్ల అపార్ట్మెంట్ లో
ఎవరికి ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించేవారు.నాకు
తెలిసినంత వరకు ఏ డాక్టర్ ని కలవాలి, ఆరోగ్య సమస్య వస్తే ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి...అని సలహాలు సూచనలు
ఇస్తుండే వాడిని.అలా అపార్ట్మెంట్ లో అందరికీ చాలా
దగ్గరైయ్యాను.అలా దగ్గరైనదే శ్యామలా శివానంద్ గార్ల
కుటుంబం.చాలా ప్రేమ కలిగిన వాళ్ళు.చాతనైతే సహాయం చేయడానికి ప్రయత్నిస్తారే తప్ప ఇతరుల సహాయాన్ని ఎప్పటికీ కోరరు.నా పదహారేళ్ళ హాస్పిటల్
ఉద్యోగంలో చాలా మందికి హెల్త్ విషయంలో గైడ్
చేసాను.నేను, శ్రీనివాస్ మూర్తి(పంతులు)ఇద్దరం వి హెల్ప్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించి,  గ్రామాల్లో మహిళలకు కాన్సర్ పై అవగాహనా శిబిరాలను, కాన్సర్ పై డాక్టర్లతో హెల్త్ టాక్స్ నిర్వహించాం. అపోలో హాస్పిటల్స్ సహకారంతో కాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాం....కట్ చేస్తే....
                   బిహెచ్ఈఎల్ బ్రాంచ్ లో మీటింగ్ పూర్తయి
సాయంత్రం అయిదింటికి సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా
ఇంటికి బయలుదేరాను.సరిగ్గా యూనివర్సిటీ బస్టాప్
వద్ద శ్యామల గారు,ఆమెతో పాటు ప్రసాద్ గారు, కనిపించారు.ప్రసాద్ గారు యూనివర్సిటీ లో కొలీగ్.చాలా సంతోషం వేసింది.చాలా రోజుల తర్వాత కలిసింది.కార్లో కూర్చున్న తర్వాత  పలకరింపులు అయ్యాక, వాళ్ళ నాన్న గారు కాన్సర్ డిటెక్ట్ అయ్యిందని తెలిసి అమ్మ గారు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారని,ఆ తరువాత ఒక నెల రోజులకే నాన్న గారు కన్నుమూశారనీ, చాలా బాధతో చెప్పారు.ఇంత మంచి మనిషికి ఇన్ని కష్టాలా, నిజంగా ఆ దేవుడికి దయ లేదా అనిపిస్తుంది.ఏ ఆడపిల్లకైనా ఏ కష్టమోచ్చినా ఏ బాధ కలిగినా,తల్లిదండ్రులకు చెప్పుకుంటేనే ఒక ఊరట.అలాంటి అవకాశం లేకుండా చేసిన ఆ దేవుడిని ఏం అనాలో తెలియడం లేదు.ఆమెను ఆ బాధ నుంచి డైవర్ట్ చేయడానికి అపార్ట్మెంట్ లోని అందరి గురించి అడగడం మొదలు పెట్టాను.ఒక్కొక్కరి గురించి చెపుతుండగానే శ్యామల గారి ఇల్లు వచ్చేసింది.ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్ లో ఉండడం లేదు.కొడుకు పెళ్లి అయ్యాక ఫణిగిరి కాలనీలో ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటున్నారు.ప్రమోద్ గారు కాఫీ తాగి వెళ్ళండని,అడిగింది, మళ్ళీ వస్తానని చెప్పి ఇంటికి బయలు దేరాను....
                               

కామెంట్‌లు