పుచ్చకాయ తపస్సు ; డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

    పిల్లలూ... భూమిమీద వుండే అనేక చెట్లు మనకు, జంతువులకు, పక్షులకు కావలసిన ఆహారాన్నాంతా అందిస్తావున్నాయి. అవెంతో కష్టపడి తయారు చేసుకున్న పళ్ళు మనం తెంపుకుంటున్నా, తింటున్నా ఏమీ బాధపడడం లేదు. మరి అవి అలా సంతోషంగా సమస్త జీవరాశులకు కావలసిన ఆహారాన్ని ఎందుకు అందిస్తున్నాయో తెలుసా... తెలీదా... ఐతే ఈ కమ్మని కథ వినండి.
ఒక వూరి పక్కనే ఒక నది పారుతా వుండేది. ఒకసారి ఎండాకాలంతో ఆ నది చాలా వరకు ఎండిపోయి ఇసుక కనబడతా వుంది. ఆ ఇసుకలో ఒక రైతు ఒక పుచ్చకాయల తోట వేశాడు. పుచ్చకాయలంటే తెలుసు గదా... కలింగడి పళ్ళనే పుచ్చకాయలని కూడా అంటారు. ఆ తోటలో ఒక తీగకి అప్పుడే ఒక చిన్న బుజ్జి పుచ్చకాయ పుట్టింది. అది నెమ్మదిగా కళ్ళు విప్పి చుట్టూ చూసింది. నది మీద నుంచి వచ్చే చల్లని గాలి సంబరంగా తల అటూయిటూ వూపుతా, ఆ తియ్యని నీళ్ళు తాగుతా నెమ్మదిగా పెరగసాగింది.
రోజూ సాయంకాలం అక్కడికి ఆ తోట యజమాని వచ్చేటోడు. ఏవేవో ఎరువులు తెచ్చి వేసేటోడు. నీళ్ళు పెట్టేటోడు. కలుపు మొక్కలుంటే పీకేసేటోడు. పశువులు ఏవీ లోపలికి వచ్చి తినిపోకుండా తోట చుట్టూ కంచె నాటించాడు. అదంతా చూసిన ఆ పుచ్చకాయ ''అబ్బ! ఆ రైతు ఎంత మంచోడు. నన్ను అపురూపంగా చూసుకుంటూ వున్నాడు'' అనుకొంది. అలా రెండు నెలలు గడిచేసరికి ఆ కాయ పెరిగి పెద్దగయి బాగా లావుగా అయింది.
ఒకరోజు రైతు లావు కాయలన్నీ తెంపుకొని బండి మీద వేసుకొని పోసాగాడు. అది చూసి పుచ్చకాయ ''అబ్బ! ఈ రైతు ఎంత మంచోడు. రోజూ ఆ ఇసుకలో పొద్దు పోవడం లేదని వూరంతా తిప్పి చూపించడానికి బండి కట్టించాడు'' అనుకొంది. సంబరంగా రోడ్డు మీద పోయే లారీలు, బస్సులు, సైకిళ్ళు, ఆటోలు... అన్నీ వింతగా చూడసాగింది.
అంతలో బండి ఒకచోట ఆగింది. అక్కడ ఒక పక్క పుచ్చకాయలు గుట్టగా పోసి కనబడ్డాయి. ఒక మీసాలోడు పెద్ద కత్తితో ఒకొక్క దాన్ని నడుమకు కోసి, మరలా దాన్ని చిన్నచిన్న ఒప్పలుగా కోసి, ఎర్రని కండను బయటకు తీసి, దాన్ని మరలా చిన్న చిన్న ముక్కలుగా కోసి, పక్కనే వున్న పెద్దగాజు సీసాలోని ఐసుముక్కల మీద పెడతా వున్నాడు. ఒకడు ఆ ముక్కలని అక్కడ కూచున్న వాళ్ళకు అందించి డబ్బులు తీసుకుంటా వున్నాడు. వాళ్ళు ఒక ముళ్ళ చెంచాతో ఆ ముక్కల నడుమన చెక్కి నోటిలో వేసుకొని కసకసకస నములుతా వున్నారు. అది చూడగానే పుచ్చకాయ ఒళ్ళు జలదరించింది. రైతు మీసాలోని దగ్గర డబ్బులు తీసుకొని పుచ్చకాయలు అక్కడ దించడం చూసింది.
''అమ్మో! ఇన్ని రోజులూ నన్ను పెంచిందీ, పెద్ద చేసిందీ, బాగా చూసుకొందీ ఇందుకోసమన్నమాట! గొర్రె కసాయోన్ని నమ్మినట్లు... ఇంకో నిమిషం గనుక ఇక్కడుంటే నా పని గూడా ఇంతే'' అనుకొంది. నెమ్మదిగా వెనుక పక్క నుండి బండి దిగి ఒక చెట్టు చాటున దాక్కొంది. ఎవరూ చూడని సమయంలో నెమ్మదిగా అక్కన్నించి తప్పించుకొని పారిపోసాగింది.
దారిలో కొందరు పిల్లలు చూసి ''రేయ్‌! పుచ్చకాయరోయ్‌... పట్టుకోని తింటే కమ్మగుంటుందిరోయ్‌'' అనుకుంటూ దానివెంట పడ్డారు. అది చూసి అదిరిపడిన పుచ్చకాయ వాళ్ళకి దొరకకుండా చించుకోని వురకడం మొదలుపెట్టింది. ఈ నగరంలో వుంటే ఈ మనుషులు బతుకనిచ్చేటట్టు లేరు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని పక్కనే వున్న నల్లమల అడవుల్లోకి పారిపోయింది. 
వురికీ... వురికీ... కాళ్ళు పీకుతా వుంటే అలసిపోయి ఒక చెట్టు కింద కూచోని ''హమ్మయ్య! ఇంకేం భయం లేదు'' అనుకొంది. అంతలో వెనుక నుండి ధనధనధనమని భూమి అదిరేలా చప్పుడు వినబడింది. ''ఏందబ్బా'' అని వెనక్కి తిరిగి చూసింది. ఇంకేముంది... ఒక పెద్ద ఏనుగు తొండం చాపుకొని... లొట్టలేసుకుంటా... దాన్ని పట్టుకొని తినడానికి దగ్గరికి వచ్చేసింది. అంతే... పుచ్చకాయ అదిరిపడి దానికి దొరకకుండా వురకడం మొదలుపెట్టింది.
అంతలో ఒక ఎటుగుబంటి దాన్ని చూసి ''ఏనుగు మామా... దాన్ని నేను పట్టుకుంటా... ఇద్దరమూ సగం సగం పంచుకుందాం... ఏం సరేనా'' అని అరిచింది. అది విన్న ఆ పుచ్చకాయ ''ఇదేందిరా నాయనా! ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా అక్కడేమో మనుషులు, ఇక్కడేమో జంతువులు... ఏవీ నన్ను బతకనిచ్చేటట్టు లేవే'' అనుకొని పక్కనే వున్న చెట్టు పైకి సరసరసర ఎక్కేసి కొమ్మల మాటున దాచి పెట్టుకొంది. ఏనుగు, ఎలుగుబంటి కాసేపు వెదికి అది కనబడకపోయే సరికి వెళ్ళిపోయాయి.
పుచ్చకాయ ''హమ్మయ్య! గండం గడిచింది'' అనుకొంది. అంతే... నెత్తిన ఎవరో టప్పున కొట్టిన చప్పుడు వినిపించింది. ''ఎవరబ్బా'' అని నెత్తి రుద్దుకుంటా పైకి చూసింది. ఇంకేముంది... ఒక గద్ద కొమ్మపై కూచోని టపాటపా కొడతా వుంది. ''ఓరినాయనోయ్‌... మనుషులూ, జంతువులే అనుకుంటిగానీ, ఆఖరికి పక్షులు గూడా మమ్ములని వదలడం లేదే'' అనుకుంటా బెరబెరా చెట్టు దిగి ఒక ముళ్ళపొదలోకి దూరి దాచిపెట్టుకొంది.
చీకటి పడగానే ఎరికీ కనబడకుండా గుట్టల మాటున, పొదల మాటున దాక్కుంటా... దాక్కుంటా... పక్కనే వున్న జగన్నాథ గట్టుపైకి ఎక్కింది. ఆ కొండ మీద ఒక గుడుంది. ఆ గుడి ముందు ఒంటికాలి మీద నిలబడి చేతులు పైకెత్తి దేవుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలైనాయి. ఐనా అది తపస్సు కొంచం గూడా ఆపలేదు. అది చూసి దేవుడు పైనుండి కిందికి దిగి వచ్చి ''ఏమే పుచ్చకాయా... ఏంది నీ బాధ... ఎందుకిలా ఒంటికాలి మీద నిలబడి ఇంత ఘోరంగా తపస్సు చేసి నన్ను దిగి వచ్చేలా చేశావు'' అని అడిగాడు. అప్పుడా పుచ్చకాయ కళ్ళ నిండా నీళ్ళు కారిపోతా వుంటే ''ఇదేంది స్వామీ! మమ్మల్ని ఈ లోకంలో ఎవరు చూసినా తినడానికి వెంట పడుతూ వున్నారు. ఇలాగయితే ఎలా మేము బతికేది'' అంటూ వెక్కివెక్కి ఏడిచింది. 
దేవుడు దానిని దగ్గరికి తీసుకోని కళ్ళనీళ్ళు తుడిచి ''ఓ పుచ్చకాయా... బాధపడకు. అసలు నేను ఈ లోకంలో పళ్ళను పుట్టించినేదే మనుషుల, జంతువుల, పక్షుల ఆకలి తీర్చడానికి. కాకపోతే ఇప్పటి నుంచీ వాళ్ళు తింటా వున్నా ఎలాంటి బాధా కలగకుండా మీకు ఒక వరమిస్తా. మీరు తీగ తొడిమె నుండి వూడిన మరుక్షణమే మీ ప్రాణాలు మీలోని ఏదో ఒక చిన్న విత్తనంలోకి మారిపోతాయి. ఆ విత్తనం భూమి మీద పడి నీళ్ళు తగలగానే మరలా మీరు మొలకెత్తి కొన్నాళ్ళకి మీ రూపం మీరు పొందుతారు. ఇదే నా వరం'' అని చెప్పి మాయమైపోయాడు.
ఆ రోజు నుండీ పళ్ళన్నీ ఈ భూమి మీదుండే సకల జీవరాశులకూ కావలసిన ఆహారాన్ని అందిస్తా, వారి కడుపులు నింపుతా హాయిగా వున్నాయి.

కామెంట్‌లు