సుప్రభాత కవిత ; బృంద
నిశ్శబ్ద విస్ఫోటనానికి వేదిక
ఎరుపుగ మారిన యవనిక
ప్రభవించే  కాంతి కలశ జ్యోతిక
కాంచనమయమైన ప్రాగ్దిశ

మర్మమెరుగని  నిర్మలహృదయం
అధర్మమెరుగని సుమ జీవితం
నీమమొక్కటే  విరిసి మురిపించడం
ముగ్ధ సౌందర్య  జీవనధర్మం

నిధులెన్నో కడుపులో దాచినా
ముత్యాలు రతనాలు నిండినా
కధనాలు వింతలూ కలిగినా
అలల సవ్వడి తప్ప అన్యము లేక

అందని గగనాల  చేరుకోవాలని
కెరటాల కేళి ఎంతగా సాగినా
తీరని కోరికలు తరుముతుంటే
హోరు ఆపని సాగర హేల...

సన్నని సవ్వడే స్వాగతమంత్రాలై
తరగల కదలికలే నృత్య సేవగా
అంజలి ఘటించు అంబుధి
అపురూప కైంకర్యముగా అమిరి

ఆకసాన అనుదినమూ ఆవిర్భవించు
అద్భుత ఆనందమయ బింబము
అరుదెంచెనదివో అమరజ్యోతి వోలె
అఖిల జగతికి శుభములొసగ...

వేంచేయు వెలుగులరేడుకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు