అంటున్నారు! ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 కవి 
అక్షరవర్షాలు కురిపించే మేఘం,
మోడైనచెట్టును చిగురింపజేసే వసంతం,
మానవత్వపు పరిమళాలు మోసే చంచలపవనం,
ఎదలోతుల్లో పల్లవించే సుస్వరాల భావగీతం,
శోకతిమిరాలు ప్రసరించని ఆనందసౌధం!

బాధామయగాధలు పట్టి పీడించినా,
విషాదపుఛాయలు విస్తరించినా,
మనసుస్పందించినా,
ఆత్మకదలినా,
మౌనంపగిలినా,
హృదయంపలికినా, 
కవితాధారగా కరుగుతాడు కవి!

కలమే హలంగా కవితాకేదారాలను పండించేవాడు,
జనంగొడవే తనగొడవగా భావించేవాడు,
రవిచూడనిదికూడా తాను లోనారసి చూసేవాడు,
ప్రతి సంఘటనకూ అప్రతిభుడై
 అప్రతిహతంగా అప్రమేయ కవితామూర్తి అయ్యేవాడు కవి!

పిల్లలకోసం,
పెద్దలకోసం,
సమాజజాగృతి సాధనకోసం,
సర్వసమాన భావనకోసం, 
మనోభవన విశాలతకోసం,
స్వార్థస్పర్ధల నివారణకోసం, 
మానవలతా వితానంకోసం,
భవ్యమైన భవిష్యత్తుకోసం,
భారతభారతి సంస్తుతికోసం,
దివ్యమైన సమాజంకోసం 
కవిత అయి ముందునడుస్తాడు కవి!

అందుకే జనులంతా "భళిరా కవివరా!" అంటున్నారు!!!
************************************
.

కామెంట్‌లు