సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -530
తప్తాయః పిండ న్యాయము
******
తప్త అనగా కాచబడినది.కరిగించబడినది,బాధించబడినది,,ఆచరించబడినది. తప్త అయః పిండః అంటే కాలిన ఇనుప గుండు అని అర్థము.
కాలిన ఇనుప గుండు ఎర్రగా నిప్పు కణికలా కనిపిస్తుంది. పొగ వుండదు కానీ అగ్ని లక్షణాలు అన్నీ వుంటాయని అర్థము.
దీనికి సంబంధించిన ఆధ్యాత్మిక శ్లోకమును చూద్దాం.
స్వయమంతర్బహిర్వ్యాష్య భాసయన్న ఖిలం జగత్/ బ్రహ్మ ప్రకాశతే వహ్ని ప్రతప్తాయస పిండవత్/" 
అనగా అగ్ని బాగా ఎర్రగా కాలిన ఇనుప ముద్దలో లేదా గుండులో తాను కాంతిమంతంగా ప్రకాశించే విధంగా బ్రహ్మం బాహ్యాంతరాల యందు వ్యాపించి సమస్త ప్రపంచాన్ని తాను ప్రకాశింప చేస్తూ ఉంది.అనగా ఇనుము చూడటానికి నల్లగా వుంటుంది.ముట్టుకుంటే చల్లగా ఉంటుంది.అగ్ని చూడటానికి ఎర్రగా వుంటుంది.ముట్టుకుంటే వేడిగా ఉంటుంది.అనుభవ జ్ఞానాన్ని కళ్ళతో చూసి చెప్పలేం.అలాగే మనలోని ఆత్మను మామూలుగా చూడలేము.ఇనుప గుండు అగ్నిలో కాలడం వల్ల అగ్ని యొక్క ఎర్రని రంగు మరియు వేడిని పొంది ప్రకాశిస్తుంది.
అదే విధంగా ఈ ప్రకృతిలోని అన్ని వస్తువులు,ఈ దేహముతో సహా అన్ని కూడా జడమైనవి, చైతన్య రహితమైనవని అగ్ని లాంటి పరబ్రహ్మ యొక్క సంపర్కంతో చైతన్యవంతమై,ప్రకాశమానమై వెలుగొందుతున్నాయని ఆధ్యాత్మిక వాదులు ఉపనిషత్తులలోని  పై శ్లోకం ద్వారా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది.
ఈ విధంగా ఇనుప గుండు పొందిన వేడిమి ప్రకాశం ఇనుప గుండు యొక్క ధర్మాలు కావు కదా! అగ్ని నుండి పొందిన వేడి, ప్రకాశం ఇనుమువే అని భ్రమ పడే వ్యక్తి అజ్ఞానే అవుతాడు.అగ్ని ధర్మాలను తెలుసుకుని ఆ జ్ఞానంతో జీవించే వ్యక్తి జ్ఞాని లేదా విజ్ఞాని అవుతాడు.
మన దేహము ఒక జడ పదార్థము.ఇందులోని అవయవాలయిన కళ్ళు  దేని వలన చూడగలుగుతున్నాయో, దేని వలన ముక్కు వాసన చూడగలుగుతుందో, దేని చేత మనసు సర్వమూ గ్రహించగలుగుతుందో అలా చేయించేదే ఆత్మ.స్వయం శక్తి లేని జ్ఞానేంద్రియాలకు శక్తినిచ్చి దేహ క్రియలు జరిగేలా చూస్తుంది.అనగా ఇనుప గుండుకు అగ్ని వేడిని ప్రకాశాన్ని శక్తిని ఇచ్చినట్లు అన్న మాట.
 అగ్ని లాంటి ఆత్మ పరంజ్యోతియై స్వయంగా వెలుగుతూ సర్వ వ్యాప్తియై ప్రకాశిస్తుంది.జడమైన, చైతన్య రహితమైన వాటికి చైతన్యం,శక్తి ప్రకాశాన్ని ఇస్తుందని ఈ తప్తాయః పిండ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం.
పై విషయాలన్నీ అంతుపట్టనివిగా అనిపించినా మనం మాత్రం మనల్ని నడిపించే జీవశక్తిని నమ్ముదాం.చైతన్యవంతులమై సమాజ హితమైన పనులను చేద్దాం.

కామెంట్‌లు