న్యాయాలు -532
తప్తాయస పత్రబిందు న్యాయము
*****
తప్త అనగా కాచబడినది, కరిగించబడనది,బాధించబడినది, ఆచరించబడినది.ఆయస అనగా ఇనుపది.పత్ర అనగా ఆకు, వ్రాయుటకు ఉపయోగించు కాగితము, పత్రము,లేఖ, రెక్క,కత్తి అంచు,కత్తి.బిందు అనగా చుక్క ,మచ్చ సున్న అనే అర్థాలు ఉన్నాయి.
కాలిన ఇనుప రేకుపై జలబిందువు పడినట్లయితే నామ రూపాలు లేకుండా నశించిపోతుందని అర్థము.
బాగా కాలిన ఇనుప రేకుకు అగ్నికి ఉండే లక్షణాలు అన్నీ వుంటాయి.అలాంటి రేకుపై నీటి చుక్క వేస్తే వెంటనే ఆవిరైపోతుంది. మన ఇంట్లో అట్లు, దోసెలు లాంటివి గట్టి మందపాటి ఇనుప రేకుతో తయారు చేసిన పెనంపై వేసుకుంటాం.అది బాగా వేడెక్కిందా లేదా చూడటానికి దానిపై నీళ్లు చిలకరించి చూస్తాం.బాగా వేడయితే చల్లిన నీటి చుక్క క్షణంలో ఆవిరైపోతుంది.
అయితే దీనినే భర్తృహరి మనుషులకు వర్తింపజేసి చెప్పిన సుభాషిత శ్లోకము దానిని ఏనుగు లక్ష్మణ కవి పద్య రూపంలో తెలుగులోకి అనువదించడం మనందరికీ తెలిసిందే.మరోసారి ఆ పద్యాన్ని చూద్దామా...
"నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా/ నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు,నా/నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్/బౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్"... అంటే అధములు వేడి చేసిన ఇనుము లాంటి వారు వారిని ఆశ్రయిస్తే నామరూపాలు లేకుండా నశించిపోతాము అనేది ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
అసలు అధములు అంటే ఎవరో? వారిని ఎందుకు ఆశ్రయించ కూడదో తెలుసుకుందాం.
అధములు అంటే నీచులు.నీచ స్వభావం కలిగిన వారు. మరి అలాంటి వారిని ఉద్దేశించి రాసిన పద్యాన్ని చూద్దాం.
కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు- మాయమాటల సొమ్ము దీయువాడు/ కులగర్వమున పేద కొంపలార్చెడి వాడు - లంచములకు వెల బెంచువాడు/చెడు ప్రవర్తన లందు జెలగి తిరుగువాడు - వావి వరుసకు నీళ్ళు వదులువాడు/ ముచ్చటాడుచు కొంప ముంచ జూసెడి వాడు - కన్నవారల గెంటుచున్నవాడు" //"పుడమిలో నరరూపుడై పుట్టియున్న/ రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర/కృపనిధీ!ధర నాగర కుంట పౌరి/వేణుగోపాలకృష్ణ!మద్వేల్పు శౌరి!" అనే ఈ పద్యాన్ని గడిగె భీమ కవి రాశారు.
ఇందులో అధముడికి ఎన్ని నీచమైన లక్షణాలు ఉన్నాయో గమనించ వచ్చు. నీచుడు కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడడు.మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరిస్తాడు.కులగర్వముతో పేదవారి ఇండ్లను నాశనం చేస్తాడు.అధికారంలో వుండి ఏ పని చేయాలన్నా విపరీతమైన లంచాలను పెంచి అడుగుతాడు. వావి వరుసలను పాటించడు.నవ్వుతూ ముచ్చట వాడుతూనే ఎదుటివారిని నాశనం చేస్తాడు.తల్లిదండ్రులనుఇంటి నుండి వెళ్ళగొడతాడు.వీటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా వాడు ఈ భూమ్మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడు, నీచుడు, అధముడే అని అర్థము.
అలాంటి వానితో స్నేహం చేసినా ఆశ్రయించినా వాని వల్ల ఏ వ్యక్తికైనా ఉన్న మంచి పేరు పోతుంది.
అందుకే పెద్దలు తరచూ అంటుంటారు ''గొడ్లల్ల బడ్లల్ల కలిసి తిరగ కూడదురా" అని గొడ్లు ఎప్పుడు పోట్లాట పెట్టుకుని కుమ్ముతాయో తెలియదు.అలాగే బడ్లు అనగా అధములు లేదా మూర్ఖులు. వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఆపద తెస్తారో తెలియదు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.
భర్తృహరి సుభాషితంలో విధంగా, గడిగె భీమ కవి గారు చెప్పిన విధంగా స్వచ్ఛమైన నీటి బిందువు లాంటి వ్యక్తులు అలాంటి వారిని చేరితే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుని నామరూపాలు లేకుండా పోతారనేది మనకు ఈ "తప్తాయస పత్రబిందు న్యాయము"ద్వారా తెలిసిపోయింది. కాబట్టి "దుష్టులకు దూరంగా ఉండమనే" పెద్దలు చెప్పిన మంచి మాటలను సదా గమనంలో పెట్టుకొందాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి