సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -523
జలాక్షర న్యాయము
******
జలము అనగా నీరు, ఉదకము, సలిలము అని అర్థము. అక్షరములో 'అ' అనగా కానిది.క్షరము అనగా నశించునది.అక్షరము అనగా నాశ(న)ము లేనిది, మారనిది స్థిరముగా ఉండునది అని అర్థము.
 నీటిని, గాలినీ బంధిస్తే తప్ప నిలకడగా వుండవు.అయినా నీటి యొక్క లక్షణం ప్రవహించడం కదా !ఎటు పల్లంగా వుంటే అటు వేగంగా ప్రవహిస్తుంది.అందుకే "నీరు పల్లమెరుగు - నిజము దేవుడెరుగు" అనే సామెత పుట్టుకొచ్చింది. ఇక్కడ ఒకోసారి నిజం కూడా. "పదుగురాడు మాట పాడియై ధరజెల్లు " అన్నట్లు నిజం కూడా మారిపోతుంది.
 ఇక జలాక్షరం అంటే నశింప జేయడానికి వీలుపడని అక్షరమైనా  అది నిలకడ లేని నీటి మీద నిలుస్తుందా? అంటే నిలవదనే అర్థం వస్తుంది.
అక్షరాలను లిఖిత రూపంలో రాస్తాం కదా!అలాంటి అక్షరం నిలకడ లేని నీటి మీద రాసినా క్షణంలో మాయం అవుతుంది.రాసామనే తృప్తి లిప్త పాటు కూడా మిగలదు.అది మనందరికీ తెలిసిందే. అయితే దీనిని మన పెద్దలు మనుషుల మనస్తత్వానికి అన్వయించి చెప్పారు.
కొందరి మాటలు నీటి మీద అక్షరాలు రాసినట్టే వుంటాయి.ముఖ్యంగా రాజకీయ నాయకుల వాగ్ధానాలు, హామీలు. వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా అమలు చేస్తారు .అవుతాయనే భ్రమ మనలో నిండుగా , మెండుగా వుంటుంది.అధికారంలోకి వచ్చాక, ఆధిపత్య పగ్గాలు వారి చేతుల్లో పడ్డాక తెలుస్తుంది. వాళ్ళ మాటలు  నీటి మీద రాతలు అని.అంటే నిలకడ లేని మాటల మూటలు అని.
 అయితే ఒక్క రాజకీయ నాయకుల మాటలేనా? ఇంకెవరు అలాంటి వారు లేరా? అనే అనుమానం మన అంతరాంతరాలలో తొలుస్తుంది. వెంటనే ఎందుకు లేరు అలాంటి వారు బోలెడు మంది మన చుట్టూ సమాజంలో ఉన్నారు. వారిలో కొందరు అప్పుడప్పుడు తారస పడుతూ వుంటారు.వాళ్ళ  మాటలన్నీ  నిలకడ లేనివే జలాక్షరాలే.ముందుగా మాటిస్తారు.ఆ తర్వాత తప్పుకుంటారు.
ఇలాంటి వారినే మాట నిలకడ లేని వారని, జలాక్షరాలకు అసలైన ఆనవాళ్ళని అంటాం. "ఎందుకలా తొందరపడి మాటిచ్చారు? అలా చేయడం మంచి పద్ధతి కాదు కదా? అని ఎవరైనా చనువుగా అడిగితే "ఇదేమైనా సత్య హరిశ్చంద్రుడి కాలమా? బలిచక్రవర్తి లాంటి వాళ్ళమా? అని నవ్వుతూ తేల్చి పడేస్తారు.
కాబట్టి అలాంటి వారిని ఉద్దేశించి చెప్పిన ఈ "జలాక్షర న్యాయము" ను గమనంలో పెట్టుకొని మనం అలాంటివి చేయకుండా,చేసే వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఎందుకంటే ఒక్కసారి పెట్టుకున్న నమ్మకం పోయిందంటే ఇంకెప్పుడూ ఎవరూ నమ్మరు అనేది గ్రహింపులో ఉండాలి. మీరేమంటారు?

కామెంట్‌లు