సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు-540
తక్ర కౌండిన్య న్యాయము
*****
తక్ర అనగా మజ్జిగ. కౌండిన్య అనగా ఒక వ్యక్తి/ ఋషి పేరు.
బంతి/ పంక్తి భోజనాలు  ఏర్పాటు చేసినప్పుడు లేదా చేస్తున్నప్పుడు జరిగే సందర్భం ఇది. బంతిలో కూర్చున్న వారందరికీ పెరుగు వడ్డించండి, ఒక్క కౌండిన్యుడికి మాత్రం మజ్జిగ వడ్డించండి అని చెప్పినప్పుడు ఆ వడ్డించే వారికి బంతిలోని అంతమందిలో ఆ కౌండిన్యుడు ఎవరో తెలుసుకునే సమయం కుదరక  బంతిలోని వారందరికీ పెరుగు బదులుగా మజ్జిగ వడ్డించడం అన్నమాట. అలా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కారణంగా  మిగతా అందరూ పెరుగు బదులుగా మజ్జిగ తోనే భోజనం ముగించవలసి వస్తుంది.
అంటే ప్రత్యేకమైన వారి వల్ల సామాన్యులు బాధింపబడుతారు అనే అర్థంతో ఈ "తక్ర కౌండిన్య న్యాయము "  చెప్పబడింది.
ఎందుకంటే ఆ పంక్తి భోజనం చేసే వారిలో కౌండిన్యుడు అనే వ్యక్తి ముఖ్యుడు కాబట్టి అతని అవసరాన్నే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. మిగతా వారికి పెరుగుతో తినాలని ఉన్నా , ఆ వ్యక్తి కారణంగా ఆ కోరికను వ్యక్తం చేయలేని స్థితి.చేసినా అక్కడ నెరవేరుతుందన్న నమ్మకం లేదు.ఇలాంటి సందర్భాలు వివాహాది శుభకార్యాల సమయంలోనూ, ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సందర్భంలోనూ జరుగుతూ ఉంటాయి.
అందరితో కలిసి అలాంటి ముఖ్య వ్యక్తులు భోజనం చేసేటప్పుడు వారి ఇష్టాలే మిగతా అందరికీ వర్తింపజేయబడతాయి. " ఇష్టమైన వంటకాలు తినకుండా ఇలాంటి వ్యక్తులతో కలిసి ఎందుకు భోజనం చేయాల్సి వచ్చిందిరా బాబూ! అని మిగతా వారు మనసులో అనుకోకుండా వుండరు. దివిటీ ముందు దీపంలా వెలవెలబోతూ లోలోపల విలవిల లాడుతుంటారు.
 దీనిని పనులకు వర్తింపజేసి చూస్తే విశేష విధులు అనగా పనులు సామాన్య విధులను బాధిస్తాయి అని అర్థము.
 ఎందుకంటే ఇళ్ళలో కానీ సామూహికంగా కానీ ఏవైనా ముఖ్యమైన పనులు తలపెట్టినప్పుడు నిత్యం చేసే పనులకు ఆటంకం కలుగుతుంది.వ్రతాలు పూజలు, తదితర కార్యాలు జరిగేటప్పుడు  మనసూ ,దృష్టి  వాటి మీదనే కేంద్రీకృతమై ఉంటుంది.కుటుంబ సభ్యులంతా  అవి సక్రమంగా పూర్తి చేయాలనే  సంకల్పంతో వుంటారు.అలాంటప్పుడు సామాన్యంగా చేసేవి వదిలేయబడతాయి.
మరి ఇలాంటివి వ్యక్తులకు జరిగితే ఎలా ఉంటుందో  ఒక చిన్న అంశాన్ని తీసుకుని గొప్ప విజయం సాధించిన బలగం సినిమాను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 అందులో బంతి భోజనం చేసేటప్పుడు ఇంటి అల్లుడిని సరిగా పట్టించుకోలేదనే నేపథ్యంలో ఏళ్ళ తరబడి ఆ కుటుంబంలో మనస్పర్ధలు రావడం చూసినప్పుడు ఇంత చిన్న విషయానికా అనిపిస్తుంది కానీ అక్కడ ఆత్మాభిమానం దెబ్బ తినడమే కారణంగా కనిపిస్తుంది.
ఇలాంటి సంఘటనలు మన ఇళ్ళల్లోనూ  పెద్దవాళ్ళు సందర్భం వచ్చినప్పుడు చెబుతూ అలా జరగకుండా హెచ్చరిస్తుంటారు.
 ముఖ్యంగా  విందులు వినోదాల సమయంలో మాంసాహారం  తినే వారు మాంసాహార భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వరుసగా కూర్చోబెట్టి వడ్డించే సమయంలో ఒకరికి ముక్కలు, మరొకరికి బొక్కలు అంటే ఎముకలు వచ్చాయనుకోండి.ఇక ఆ తర్వాత వుంటుంది.అసలు కత. "గతి లేక వెళ్ళామా? రమ్మని పిలిస్తేనేగా వెళ్ళింది ?ముక్కల బదులు అలాంటివి  పెట్టి అవమానిస్తాడా? ఇంకోసారి వాడి/ వాళ్ళింటికి వెళ్ళే ముచ్చటే లేదు" అని చిందులు వేస్తూ అక్కడే వాళ్ళతో మాటా ముచ్చట్లు, ఆటల్లో ఉన్న భార్యా పిల్లలను కూడా తీసుకుని కోపంతో వెళ్ళి పోవడం  జరుగుతుంది. లేదంటే తాము ఎప్పుడూ పొందే మర్యాదలో ఏ చిన్న లోపం జరిగినా అలా  ముఖం గంటుపెట్టుకుని విసురుగా వెళ్ళిపోవడం,ఆ తర్వాత ఎంతో బతిమిలాడితే, క్షమాపణలు చెప్పుకుంటేనే  సామాన్య స్థితికి రాకపోవడం జరుగుతుంది. చూసే వాళ్ళకి ఓ సినిమాలా అగుపిస్తుంది.కానీ ఆ సమయంలో ఇంటోళ్ళ పరిస్థితే తలుచుకుంటే 'అయ్యో! పాపం!' అనిపిస్తుంది.ఇంత ఖర్చు పెట్టి చేసినా మాట పడాల్సి వచ్చిందే అన్న బాధ వర్ణనాతీతం.
 
 కాబట్టి ఎంత విశేష విధులు ఉన్నప్పటికీ సామాన్య విధులను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలనే విషయాన్ని ఈ  "తక్ర కౌండిన్య న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
 విషయాలు తెలుసుకున్నాం కదా. ఇలాంటివి నిర్వహించేటప్పుడు మన పెద్దలు "మనసూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి" అంటుంటారు.కాబట్టి చేసే ఏ పని విషయంలోనైనా వాళ్ళ మాటలను మనం ఎల్లప్పుడూ  గుర్తు పెట్టుకుందాం. ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్త పడదాం.

కామెంట్‌లు