ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చదివించాలి ;--పెద్దపల్లి డీఈఓ మాధవి
 పిల్లల ఇండ్లకు వెళ్లి ప్రచారం 
-ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ఊరేగింపు, కరపత్రాల పంపిణీ 
+++++++++++++++++++++++++++++++++++++++++
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని 
ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని పెద్దపల్లి డీఈఓ డి. మాధవి కోరారు. శుక్రవారం ఆమె కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీడీవో, ఎంఈఓ, ఎంఎన్ఓలతో కలిసి కాలినడకన ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఫ్లెక్సీలతో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులకు కరపత్రాలు అందిస్తూ ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వివరించారు. అనంతరం ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకుల చేత శాస్త్రీయ విద్యా విధానంలో బోధన చేయిస్తున్నామని, బడీడు కలిగిన పిల్లల్ని అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈఓ కోరారు. పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై మోజు వీడాలని, ఫీజుల రూపంలో చెల్లించే డబ్బును పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారంతా ఉన్నత స్థానాల్లో  స్థిరపడ్డారని, దానికి ఉదాహరణ తామేనన్నారు. అన్ని హంగులతో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి, ఉచితంగా నాణ్యమైన విద్యా సౌకర్యాలను పొందాలని పిల్లల తల్లిదండ్రుల్ని డీఈఓ కోరారు. తర్వాత ఎంపీపీ, జడ్పీటీసీలు నూనేటి సంపత్ యాదవ్, వంగల తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఏటా  కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్ని  అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి వాటిని బలోపేతం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. ఎంఈఓ టి. సురేందర్ కుమార్, ఎంఎన్ఓ సిరిమల్ల మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయని, గ్రామంలోని బడీడు పిల్లలందరినీ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రుల్ని కోరారు. కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ స్పెషల్ ఆఫీసర్ గోవర్ధన్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు నరేడ్ల సునీత, ఈర్ల సమ్మయ్య,   అల్లూరి రవీందర్, ఏపీఎం కనుకయ్య, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయునీ,ఉపాధ్యాయులు, సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఐకెపి సీసీలు, వివో అధ్యక్షులు, మహిళా సంఘాల సభ్యులు, మధ్యాహ్న భోజన వర్కర్లు, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు