జన్మ!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
నీటిలా  ఇంకిపోతున్నాను
ఎడారిలా విస్తరిస్తున్నానూ
ఆకులా రాలిపోతున్నాను
మోడులా ఎండిపోతున్నాను!!

ఎగిరే గాలిలా
తిరిగే భూగోళంలా
అటు ఇటు తిరిగిన పడిపోని పాదంలా
ఏది కనిపించదు!!

కలిసి నడిచే కాళ్లు
కలిసి చేసే చేతులు
కలిసి వినే చెవులు
కలిసి చూసే కళ్ళు
అలసిపోయిన శరీరం

మళ్లీ మొలకెత్తడానికి సిద్ధమైన విత్తనం
కొత్తగా పుడుతున్న నక్షత్రాలు
అల్లుకున్న తీగకు పూస్తున్న పూలు

సర్వం కురిసిన మేఘం
సందెపొద్దు సౌందర్యం
పూల తోటల పరిమళం
అతి పురాతన కోటల సౌరభం

చరిత్ర పుటల్లో మాటల్లో కడలి అలల్లా కదలాడుతున్నాయి!!

ఎండమావుల దృశ్యం
పర్వతం పరాక్రమం
ఉప్పెనల హృదయం
సముద్రాలలోయలు
పచ్చని మైదానాలు
దాగివున్న చూపులు
ఎప్పటికీ తిరిగిరాని లోకాలు!!!

స్వాతి చినుకు
చిగురుటాకు తాజాదనం
ఆల్చిప్ప శరీరం
నత్త నడక లయలు

అతి సుకుమారపు పువ్వు
కొత్త కొత్త సుగందాలు
తెల్లని మల్లె పందిరి
గడ్డి పై విరిసే నీటి ముత్యాలు
భూమిపై విరిసిన ఇంద్రధనస్సులు
ప్రకృతి సంతకాలు!!!

కోటి జన్మలెత్తిన
మళ్లీ పుట్టలేం!!
శతకోటి జన్మలెత్తిన
పంచభూతాలు జన్మించవు!!!?

Dr.pratap koutilya

కామెంట్‌లు