'శంభో!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 కందములు.
=========
31.
కాలము మరచితి మాయా
జాలము నందున బడితిని జగమను రొంపిన్
గూలితి దరిజేర్చుకొనుచు 
పాలన చేయంగ రమ్ము!భవహర శంభో!//

32.
కరముల చే నీపదములు 
నిరతము కడిగెద కపాలి !నిశ్చల భక్తిన్ 
వరముల గోరను దేవా !
పరిచారికనై కొలిచెద పడిపడి శంభో!//
33.
క్రోధము విడనాడి సతము 
సాధన లన్నియు సలుపుచు సాత్విక మతితోన్
సాధువులౌ యోగివరు
బోధలు వినిపొందవలయు పుణ్యము శంభో!//
34.
మూలపరాత్పర శంకర !
నాలో నిలిచిన నిరంజనా!వినుమయ్యా!
యేలిక నీవని తల్చితి 
ఫాలాక్షా !నిను బిలిచితి భక్తిగ శంభో !//
35.
అభిషేకము నే జేసెద 
శుభఫలితము నీయ వయ్య !శూలీ !నిన్నే 
విభునిగ మదిలో తలచెద 
నిభచర్మాంబరధర!శివ !యిఱవుగ శంభో !//

కామెంట్‌లు