శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు.
===============
91.
భక్తు ప్రహ్లాదు కాపాడు బాంధవుడవె 
ద్రౌపదికి నీవె సర్వము దాత వీవె 
కొలిచి పిలిచెద నిన్నునే కూర్మి తోడ 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
92.
పరము కోరితి నీవె నా బ్రహ్మవనుచు 
శుద్ధ చైతన్య రూపనీ సొబగు చూడ 
దివ్య చక్షుల నీయవే దీనబంధు!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
93.
జన్మ జన్మల కర్మల జాల మందు 
జిక్కి శల్యంబునైతిని చింత మిగిలె 
కర్మ బంధన మెటులైన కాలి పోవ 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
94.
పరుష మైనట్టి పలుకులు పల్కి జనులు 
కాన లేరటె వేల్పుని కలిమి యందు 
కలిమిబలుముల పైత్యంబు కప్పివేసె 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
95.
విభుని జూడగ లేనట్టి విభవమేల?
ధర్మ చింతన మెరుగని దారులేల?
సద్గుణంబుల నిచ్చెడి చదువునేర్పి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు