తెలుగు వెలుగు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మన తెలుగుసీమను ఏలినవారంతా
పరాయి భాషనే మనకు అంటగట్టారు
అయితేనేం, మనభాషలో ఎన్నో
పరాయిభాషాపదాలు కలిసిపోయి
మనభాష మరింత పరిపుష్టమయింది
మరింత కొంగ్రొత్త పరీమళంతో
మరింత తీయ తేనియలొలుకుతోంది
కవిత్రయ సంస్కృతపదభూయిష్ట ఉద్గ్రంథమైనా
పోతన భక్తిరసప్లావిత పురాణమైనా
యయాతి అచ్చతెనుగు కావ్యమైనా
ఆ దివినుండి కురిసిన 
తెలుగు ఇక్షురసవర్షమే సుమా!
భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో
దేశాభిమానంతో సమానంగా
తెలుగు భాషాభిమానమూ వేళ్ళూనుకుంది
ఎంతోమంది తెలుగు కవిశ్రేష్ఠులు తమ
భాషామతల్లికి సాహితీ గ్రంథమాలలను
సభక్తికముగా అర్పించి అర్చించారు
స్వాతంత్ర్యానంతరం 
భాషాప్రయుక్తాన ఏర్పడిన
తెలుగురాష్ట్రములో గిడుగుపిడుగులు,
గురజాడ, కందుకూరి, చిలకమర్తి, రాయప్రోలు,
దేవులపల్లి, సురవరం, కాళోజీ, దాశరథి, సినారె
వంటి కవీంద్రులెందరో కృషిసలిపి తెలుగుభాషా
దీపికను జగజ్జగీయమానం గావించారు
అన్నీఉన్నా అల్లుడినోట్లో శనిఉన్నట్లు మనం ఇంకా
పరాయిభాషా వ్యామోహప్రవాహంలోనే ఉన్నాం
సినిమా, టీవీ, పత్రిక, పాలనా పథాలన్నీ
తెలుగుభాషా ప్రదీప్తమైతేనే
తెలుగుభాషా పరిరక్షణ జరిగి
భావితరాలకు తెలుగువెలుగును పంచగలము!!
*************************************

కామెంట్‌లు