న్యాయాలు-541
తాళ వృక్షచ్ఛాయ న్యాయము
*****
తాళ వృక్షం అనగా తాడి చెట్టు.ఛాయ అనగా నీడ,ప్రతిబింబము,కాంతి రంగు, సూర్యుని భార్య,సమరూపత,అసత్య కల్పన, సౌందర్యము,రక్షణము,,పంక్తి, చీకటి,లంచము అనే అర్థాలు ఉన్నాయి.
తాళ వృక్ష ఛాయ అంటే తాడి చెట్టు నీడ.తాడిచెట్టు సన్నగా చాలా పొడుగ్గా ఆకాశమంత ఎత్తుగా ఉన్నట్లు ఉండటం వల్ల ఎండ నుంచి దాని నీడ మనల్ని రక్షించలేదు.సేద తీరడానికి పనికి రాదన్న మాట.అందుకే తాటిచెట్టు కింద సేద తీరాలని అనుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు అనే అర్థంతో ఈ "తాళ వృక్షచ్ఛాయ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అయితే ఈ తాడి చెట్టు గురించి బోలెడు సామెతలు ఉన్నాయి.అఃతకు మించి ఈ తాడి చెట్టు మానవునికి ఎంతగా ఉపయోగపడుతుందో కీ.శే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాసిన "ఆంధ్ర కల్పవృక్షం"వ్యాసం చదివితే తెలుస్తుంది.
ముందుగా తాడి/ తాటి చెట్టు మానవునికి నేస్తం అని ఎలా చెప్పుకోవచ్చో చూద్దాం.
తాటి చెట్టు పామే జాతికి చెందిన ఒక చెట్టు. 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.ఆకులు 2నుండి 3 మీటర్ల పొడవుతో అరచేయి ఆకారంలో ఉంటాయి. తాటి చెట్టు లోని ప్రతి భాగం నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది.అందుకే దీనిని 'ఆంధ్ర కల్పవృక్షం' అంటారు. ఈ చెట్టు ఆకులు ఇళ్ళ పాకలు వేసుకోవడానికి, చాపలు బుట్టలు టోపీలు గొడుగులు, సంచులు, విసనకర్రలు మొదలైనవి చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాదు పూర్వకాలంలో కాగితం కనిపెట్టక ముందు తాళ పత్రంగా కాగితంగా ఉపయోగించేవారు.వీటిపై రాసిన గ్రంథాలను తాళపత్ర గ్రంథాలు అంటారు.
ఇక తాటి చెట్టు కాండము ఇల్లు కట్టుకోవడానికి దూలంగా,స్తంభంగానూ,ఈ మాను లోపలి గుజ్జు తీసి వేసి పొలాలకు నీళ్ళు పారే గొట్టంగానూ ,చిన్న చిన్న కాలువలపై వంతెనగానూ ఉపయోగిస్తారు.
తాటి ముంజలు,తాటి బెల్లం,తాటికల్లు, తాటిపండ్ల నుంచి తాండ్ర,తాటి మొలక- ఇలా ఒకటేమిటి తాటి చెట్టు లోనివన్నీ మానవునికి ఆహారంగాను, ఆయుర్వేద వైద్యంలోనూ ఉపయోగపడేవే.అందుకే తాటి చెట్టును గీత కార్మికులకు,రైతులకే కాకుండా సామాజిక సంపద అని కూడా చెప్పుకోవచ్చు.
ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే తాటిచెట్టు నీడ మాత్రం మనకు ఉపయోగపడదు.చాలా ఎత్తుగా వుండటం వల్ల సూర్యుడి వేడిని అడ్డుకునేందుకు వీలు పడదు. అందుకే అలాంటి తాటి చెట్టు నీడను మొరటుగా విమర్శిస్తూ ఓ సామెతనే సృష్టించారు మన పెద్దవాళ్ళు. "తాటిచెట్టు నీడ కాదు తగులుకున్న వ్యక్తి భర్త/ భార్య కాదు". అనే సామెత అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదని హెచ్చరిస్తుంది.
ఆ సామెతే కాకుండా "తాడి చెట్టు నీడ నీడా కాదు" అనడానికి ఏనుగు లక్ష్మణ కవి రాసిన పద్యాన్ని చూద్దామా...
"ధర ఖర్వాటుడొకండు సూర్యకర సంతప్త ప్రధనాంగుడై/ త్వరతోడవ బరువెత్తి చేరి నిలిచెన దాళద్రుమచ్ఛాయ ద/ చ్చిరముం దత్ఫల పాతవేగమున విచ్చెవ శబ్ద యోగంబుగా/బొరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్"
అనగా ఒక బట్టతల వ్యక్తి నెత్తిమీద ఎండ వేడికి మాడి మసవుతూ వున్నాడు.దానికి తోడు కాళ్ళ కింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారిలా కనిపిస్తోంది.కనుచూపు మేరలో ఎలాంటి నీడనిచ్చే ఎలాంటి వృక్షాలు లేవు. అల్లంత దూరంలో ఓ తాటిచెట్టు కనబడింది. గబగబా ఆ చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు.దురదృష్టవశాత్తు అప్పుడే ఆ చెట్టు కున్న తాటికాయ ఊడి అతడి తల మీద పడింది.అసలే తాటిపండు ఇంకేముంది తలపగిలింది.దైవ బలం లేనప్పుడు ఆపదలు వెంటపడి వేధిస్తాయి" కాబట్టి తాడి చెట్టు నీడను చూసి మనల్ని ఎండ నుండి కాపాడుతుందని భ్రమ పడొద్దు, ఇలాంటి ప్రమాదాలు పొంచి వుంటాయని అర్థము చేసుకోవాలి.
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి మరికొన్ని చూద్దాం..."తాడి చెట్టు తల్లి కాదు - ఈత చెట్టు ఇల్లు కాదు". "తాడి చెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు.". "తాడిని తన్నే వాడు ఉంటే తలదన్నే వాడూ వుంటాడు". "తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా?"."తాటి చెట్టుకు తేనె పట్టు పడితే ఈత చెట్టుకు ఈగలు ముసిరాయట." తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నాడట". ఇలా తాడి చెట్టు గురించి ఎన్నో సామెతలు ఉండటం విశేషం.
"తాళ వృక్షచ్ఛాయ న్యాయము"వల్ల తాటి చెట్టు యొక్క ఎన్నో రకాల విషయాలు, విశేషాలు తెలిశాయి కదా.చెట్టుకు సంబంధించిన సామెతల్లో మనకు కావాల్సిన హెచ్చరికలు, హితోక్తులు చాలానే ఉన్నాయి.అవి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.ఇక చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడినా దాని నీడను నమ్మి మాత్రం పొరపాటున కూడా చెట్టు కిందకు వెళ్ళొద్దని,వెళ్ళి లేని పోని కష్టాలు తెచ్చుకోవద్దని ఈ న్యాయము ద్వారా తెలిసిపోయింది కదండీ.మరి జాగ్రత్తగా ఉందాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి